యాదగిరిగుట్టలో భట్టికి అవమానం జరిగిందా!

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల తొలిపూజ కార్యక్రమం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం యాదగిరిగిగుట్ట బ్రహ్మోత్సవాల తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.

ఈ సమయంలో రేవంత్‌రెడ్డి దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అక్కడ ఏర్పాటు చేసిన పీటలపై కూర్చోగా భట్టి విక్రమార్క, మహిళా మంత్రి కొండా సురేఖ నేలపై చిన్న పీటపై కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

దళిత సామాజిక వర్గానికి చెంది న ఉప ముఖ్యమంత్రికి, మహిళా మంత్రికి దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ బిఆర్‌ఎస్ నేతలు, బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా వివిధ వర్గాల నేతలు విమర్శలు గు ప్పించగా, కౌంటర్‌గా కాంగ్రెస్ నేతలు ఆ విమర్శలను తిప్పికొట్టారు.

ఈ ఆరోపణలకు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే సమానత్వం ఉందని, కాంగ్రెస్ అంటేనే ఆకాశమంత సమానత్వం అని పార్టీ శ్రేణులు ట్వీట్లు చేశారు. భారత్ జోడో యాత్ర సమయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి టిఫిన్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పార్టీ శ్రేణులు చేసిన ట్వీట్లను రీట్వీట్లు చేసింది.

దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు అని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బిఆర్‌ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. 

బిఆర్‌ఎస్ పార్టీ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికీ తెలుసని ధ్వజమెత్తారు. గత బిఆర్‌ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సిఎల్‌పి విలీనం అంటూ కొత్త కథ అల్లి భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు భట్టి విక్రమార్కకు అవమానం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు

దళిత ముఖ్యమంత్రి అంటూ ప్రగల్బాలు పలికి దళితులను మోసం చేసిన బిఆర్‌ఎస్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరని అన్నారు.
యాదగిరి గుట్టలో భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని ఉద్దేశపూర్వకంగా బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. కెసిఆర్ దళితుడిని సిఎం చేస్తానని చెప్పి, దళిత మంత్రులు కొప్పుల ఈశ్వర్, తాటికొండ రాజయ్యలను ఎలా అవమానించారో ప్రజలు చూశారని పేర్కొన్నారు. కెసిఆర్‌ను దళిత మంత్రులు ఎన్ని సార్లు కలిశారని అడిగారు.

అగ్రవర్ణాలకు సంబంధించిన సిఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డిభట్టి విక్రమార్క, బిసి మంత్రి కొండా సురేఖను అవమానించారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది చాలా దౌర్భాగ్యమని, సిఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించి, కాంగ్రెస్ తన నిజ స్వరూపం బయటపెట్టిందని బిఎస్‌పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇది యావత్ దళిత జాతిని అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.