సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య ప‌ట్టాలెక్కిన మ‌రో వందేభార‌త్

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సార‌థ్యంలో మ‌రో రెండు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప‌ట్టాలెక్కాయి. సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య ఇప్ప‌టికే వందే భార‌త్ రైలు న‌డుస్తుండ‌గా, నేటి నుంచి మ‌రొక‌టి అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో పాటు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కొన్ని స్టేష‌న్ల‌ను క‌లుపుతూ క‌ల‌బుర‌గి – బెంగ‌ళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభించారు. 
 
వీటితో పాటు మొత్తం 10 వందే భార‌త్ రైళ్ల‌ను అహ్మ‌దాబాద్ నుంచి ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్ – విశాఖ‌, క‌ల‌బురగి – బెంగ‌ళూరు, ల‌క్నో – డెహ్రాడూన్, పాట్నా – ల‌క్నో, న్యూ జ‌ల్‌పాయ్ గుడి – పాట్నా, పూరి – విశాఖ‌ప‌ట్నం, రాంచీ – వార‌ణాసి, ఖ‌జుర‌హో – ఢిల్లీ, అహ్మ‌దాబాద్ – ముంబై, మైసూర్ – చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్ల‌ను మోదీ ప్రారంభించారు. 
 
మొత్తంగా వందే భార‌త్ రైళ్ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో ప‌రుగులు తీస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల‌కు మోదీ శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలో 9 పీఎం గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జ‌న ఔష‌ధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్ల‌ను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 
 
కొళ్లం – తిరుప‌తి మెయిల్ ఎక్స్‌ప్రెస్, ప‌లు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజ్ మార్పిడి, బైపాస్ లైన్ల‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా మాట్లాడుతూ భారతీయ రైల్వేలు మరింత అభివృద్ధి చెందాలని చెప్పారు. మన రైల్వేను మరింత ఆధునీకీకరిస్తాం.. నాది గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్లలో దేశీయ ఉత్పత్తుల అమ్మకం బాగా పెరగాలని ప్రధాని ఆకాంక్షించారు. దేశం నలుమూలల నుండి ప్రతిష్టాత్మక అయోధ్యకు రైళ్లు నడుపతున్నామని తెలిపారు.