ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీకి అందించిన ఎస్‌బిఐ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల కొనుగోలుదారులు, స్వీకరణదారుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బిఐ) మంగళవారం సాయంత్రం సమర్పించింది. మార్చి 12న వ్యాపార లావాదేవీలు (బిజినెస్ అవర్స్) ముగిసేలోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని సోమవారం సుప్రీంకోర్టు ఎస్‌బిఐని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ ఎస్‌బిఐ సమర్పించిన ఎన్నికల బాండ్ల వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా పొందుపరచాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15న, మార్చి 11న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎస్‌బిఐ మంగళవారం ఎన్నికల కమిషన్‌కు అందచేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎన్నికల కమిషన్ తెలిపింది. 

2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తన 30 శాఖల ద్వారా ఎస్‌బిఐ రూ. 16,518 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను జారీచేసింది కాగా, ఫిబ్రవరి 15న వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది.  దాతల పేర్లు, వారి విరాళాల మొత్తం, వాటి గ్రహీతల పేర్లను వెల్లడించాలని ఎస్‌బిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా..వివరాల వెల్లడికి తమకు జూన్ 30 వరకు గడువు పెంచాలని ఎస్‌బిఐ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. 

మంగళవారం బిజినెస్ అవర్స్ ముగిసేలోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బిఐని ఆదేశించింది.  2018 జనవరి 2న ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాజకీయ నిధుల సమీకరణలో పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా నగదు విరాళాల స్థానంలో ఎన్నికల బాండ్లను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2018 మార్చిలో ఎన్నికల బాండ్ల తొలి అమ్మకం జరిగింది.

తమ అధికారిక బ్యాంకు ఖాతాలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లను డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ బాండ్లను జారీచేసే అధికారం కేవలం ఎస్బిఐకి మాత్రమే ఉంది. భారతదేశానికి చెందిన పౌరులు, సంస్థలు మాత్రమే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడానికి అర్హులు.  గత లోక్‌సభ ఎన్నికలలో లేదా అసెంబ్లీ ఎన్నికలలో ఒక శాతానికి మించి ఓట్లు పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు సేకరించడానికి అర్హులు.

దీంతో 2018 మార్చి నుంచి ఇప్పటివరకు 30 విడతలుగా ఎస్బీఐ రూ.16,518 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించింది. ఎవరు ఇచ్చారు, ఏయే పార్టీలకు ఇచ్చారనే వివరాలు మాత్రం ఇప్పటివరకు బయటకు వెల్లడి కాలేదు. అజ్ఞాత వ్యక్తుల నుంచి నిధులు పొందేందుకు అవకాశం ఇస్తున్న ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.