ఆ మూడు అవినీతి, కుటుంబ పార్టీలు… ఓడించండి

తెలంగాణాలో నెలకొన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ అవినీతి పార్టీలని, పైగా అవి కుటుంభం పార్టీలని, వాటిని ఓడించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపిచ్చారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బిజెపి బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ప్ర‌సంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మజ్లిస్ గుప్పిట్లో ఉన్నాయ‌ని చెబుతూ ఆ రెండు పార్టీలతో నిజాం పాలన విముక్త తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

జవహర్ లాల్ నెహ్రూ కుటుంబ పార్టీ కాంగ్రెస్  కాగా,కేసీఆర్, కేటీఆర్ ల పార్టీ బీఆర్ఎస్ అని ఆయన దుయ్యబట్టారు. ఇక ఒవైసీ కుటుంబ పార్టీ మ‌జ్లీస్ అంటూ ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో అన్నివర్గాల ప్రజల పార్టీ బీజేపీ అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలు అని మండిపడ్డారు. 2జీ స్కాం, భోఫార్స్ కుంభకోణం ఇలా దేశంలో కాంగ్రెస్ చేయని అవినీతి లేదని పేర్కొన్నారు. 

తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం మొదలు ఎన్నో అవినీతి చేశార‌ని, కవితకు లిక్కర్ స్కాంలో ఆరోపణలున్నాయని హోంమంత్రి గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించారని చెబుతూ దేశం మోదీ పాలనలో సురక్షంగా ఉంద‌ని చెప్పారు. పాకిస్తాన్ ఆటలు మోదీ సాగనివ్వలేదని పేర్కొన్నారు. 

సిఎఎ తీసుకొచ్చి మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తున్నామని చెప్పారు. దేశ విద్రోహ శక్తులకు తప్ప సిఎఎ ఎవరికి వ్యతిరేకం కాద‌ని,  సిఎఎ సామాన్య శరణార్థులకు వ్యతిరేకం కాద‌ని అమిత్ షా భరోసాఇచ్చారు. తెలంగాణ అభివృద్ది కేవలం మోదీ సర్కారుతో సాధ్యం అని తెలిపారు.  సోనియా గాంధీకి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని, కేసీఆర్ కు కేటీఆర్ ను సీఎం చేయాలని లక్ష్యం అని ఆరోపించారు. దేశంలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు కుటుంబాల కోసమేనని తేల్చి చెప్పారు. మోదీ సర్కారు మాత్రం భారత కుటుంబ కోసం అని తెలిపారు. 

ప్రపంచ దేశాల్లో మోదీకి దక్కుతున్న అపూర్వ స్వాగతం మోదీది కాద‌ని, యావత్ భారత ప్రజలకు దక్కుతున్న గౌరవం అని అమిత్ షా పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ ను మూడో అగ్ర దేశంగా నిలపడమే మోదీ  లక్ష్యం అని అమిత్ షా తెలిపారు.

”మోదీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర అభివృద్ధికి మోదీ నిధులు కేటాయించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకున్నది. కేసీఆర్‌ నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని ఎదగనివ్వలేదు. ఈసారి రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లు బీజేపీ గెలవాలి. మజ్లీస్‌ పీడ తొలగాలని పాతబస్తీ వాసులు కోరుకుంటున్నారు” అని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

కాగా, రాహుల్‌ గాంధీ, పార్లమెంట్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.