17న మోదీ, చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా ప్రచారం ప్రారంభం

 ఆరేళ్ళ వ్యవధి తర్వాత తెలుగు దేశం పార్టీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడం, జనసేనతో కలిసి వచ్చే ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం వైపు ద్రుష్టి సారిస్తున్నారు. ఈ నెల 17న చిలుకలూరిపేటలో జరిగే బహిరంగసభలో ఈ మూడు పార్టీల అగ్రనేతలు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహితం ఈ బహిరంగసభలో పాల్గొంటారు. 2014 ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు నాయకులు కలిసి పదేళ్ల అనంతరం ఉమ్మడిగా రాజకీయ వేదికపై కనిపించనున్నారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిపిన తర్వాత ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు నాయుడు వేదిక పంచుకోవడం కూడా ఇదే కావడం గమనార్హం.
 
చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న మూడు పార్టీల ఉమ్మడి సభను తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ. సభను జయప్రదం చేసేందుకు 13 కమిటీలను టీడీపీ నియమించింది. ఈ సభ నిర్వహణ, కమిటీలతో సమన్వయము బాధ్యతను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలుగుదేశం నాయకత్వం అప్పగించింది.
 
ఈ కమిటీల సభ్యులతో మంగళవారం భేటీ జరిపిన చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండే కార్యక్షేత్రంలోకి దిగాలని, బహిరంగసభను జయప్రదం చేందుకు పట్టుదలతో పని చేయాలని సూచించారు. అప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉండడంతో ఈ బహిరంగ సభ ఓ విధంగా ఎన్నికల ప్రచారం ప్రారంభంగా మారనుంది.
 

17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు.వాస్తవానికి 16వ తేదీన ఆయన విశాఖ వస్తారని.. బీజేపీ ర్యాలీలో పాల్గొంటారని ప్రకటన వెలువడింది. అయితే ఈ పర్యటన రద్దయిందంటూ స్థానిక బీజేపీ నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం సోమవారం సాయంత్రం సమాచారమిచ్చింది. 

ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయడానికి 3 పార్టీల నుంచి 115 మంది నేతలతో 12 ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల వివరాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం రాత్రి ప్రకటించారు.
టీడీపీ క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ స్థాయుల్లో వివిధ బాధ్యతల్లో ఉన్న 56 వేల మంది నేతలతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ  టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కనీసం 160 అసెంబ్లీ సీట్లు సాధించాలని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభను ఘనంగా జయప్రదం చేయాలని చెబుతూ  విధ్వంస పాలనలో శిథిలమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఈ ఉమ్మడి సభ తొలి అడుగని టిడిపి అధినేత తెలిపారు. మూడు పార్టీల పొత్తు జగన్‌ను ఓడించడానికి కాదు.. రాష్ట్రాన్ని గెలిపించడానికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్ర విస్తృత ప్రయోజనాల కోసమే 3 పార్టీలు చేతులు కలిపాయని చెప్పారు.