ఈఎఫ్‌టీఏతో భారత్ స్వేచ్ఛా వాణిజ్యం

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా.. ఐరోపాలోని 4 దేశాలతో భారత్.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ( ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీంతో స్విట్జర్లాండ్‌, నార్వే, ఐస్‌ల్యాండ్‌, లిచెన్‌స్టీన్‌ దేశాలతో కూడిన యూరోపియన్‌ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) రానున్న 15 ఏండ్లలో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల (రూ.8,27,523 కోట్ల) పెట్టుబడులు పెట్టడంతోపాటు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నది. 
 
ఇందుకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్‌, ఈఎఫ్‌టీఏ ఆదివారం సంతకాలు చేశాయి. రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా) పేరుతో దీన్ని కుదుర్చుకున్నారు.  ఈ ఒప్పందంతో దేశీయ పరిశ్రమల్లో తయారయ్యే అన్ని రకాల వస్తువులు ఎలాంటి సుంకం లేకుండానే ఈఎఫ్‌టీఏ దేశాల్లో అందుబాటులోకి రావడంతోపాటు ప్రాసెస్‌ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు పన్ను రాయితీలు లభిస్తాయి. 
 
కాగా, స్విట్జర్లాండ్‌ ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచే అన్ని రకాల పారిశ్రామిక వస్తువులపై సుంకాలను తొలగించింది.  ఈ ఒప్పందం ప్రకారం స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై భవిష్యత్తులో సుంకం ఉండదు. ఈ క్రమంలో రోలెక్స్, ఒమేగా, కార్టియర్ సహా ఇతర సంస్థలకు చెందిన వాచీలు, చాక్లెట్లు వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి. 
 
వీటితో పాటు స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే సాల్మన్, ట్యూనా వంటి సీ ఫుడ్, ఆలివ్, అవకాడో వంటి పండ్లు, కాఫీ గింజలు, ఆలివ్ ఆయిల్‌కు టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. వీటితో పాటు పలు రకాల స్వీట్లు, సైకిల్ విడి భాగాలు, స్మార్ట్ ఫోన్లు, వైద్య పరికరాలు, మందులు, దుస్తులు, స్టీల్ ఉత్పత్తులు వంటి దిగుమతులు కూడా ఇకపై తక్కువ ధరకే లభిస్తాయి. 
 
ఒప్పందం అమల్లోకి వచ్చాక.. ఐదేళ్లలో కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్‌పై సుంకం 2.5 శాతం తగ్గించనున్నారు. బంగారంపై మాత్రం ఎలాంటి రాయితీ లభించదు. 5 డాలర్ల నుంచి 15 డాలర్లలోపు ఉండే వైన్‌లపై తొలి ఏడాదిలో సుంకం 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించనున్నారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల రానున్న 15 సంవత్సరాల్లో దేశంలోకి రూ. 8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకు కూడా హామీ లభించింది.
 
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. మన దేశంలోని పరిశ్రమల్లో తయారవుతున్న ఉత్పత్తులను అన్నింటినీ సుంకాలు లేకుండానే  ఈఎఫ్‌టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్డ్ వ్యవసాయ ఉత్పత్తులకు కూడా సుంకాల్లో రాయితీలు వస్తాయి. మన ఉత్పత్తులపై జనవరి నుంచి స్విస్ సుంకాల్ని తొలగించడం గమనార్హం. 
 
సోయా, బొగ్గు, డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తుల్ని మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. దీంతో వీటికి సుంకాల్లో రాయితీలు మాత్రం అమలు కావు.
స్విట్జర్లాండ్ నుంచి మన దేశం ఎక్కువగా పసిడి, యంత్రాలు, ఔషధాలు, కోకింగ్ అండ్ స్టీమ్ కోల్, ఆర్థోఫెడిక్ అప్లియెన్సెస్, వాచీలు, సోయాబీన్ ఆయిల్, చాక్లెట్లు వంటి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.