రాష్ర్టాల వారీగా `ఇండియా’ కూటమి ముక్కలు

విపక్ష ‘ఇండియా’ కూటమికి పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా షాక్‌ ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇదివరకే ప్రకటించిన దీదీ ఆదివారం రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ మైదానంలో జరిగిన సభలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 
 
ఈసారి 7 మంది సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్‌ నిరాకరించిన దీదీ కొత్త ముఖాలను బరిలోకి దింపారు. 18 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు.  రాష్ట్ర క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులతోపాటు 9మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మమత లోక్‌సభ బరిలోకి దింపారు. పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా రెండు గ్రూపుల మిశ్రమంగా కనిపించింది. 
 
బహరామ్‌పుర్‌ నుంచి మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను టీఎంసీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపింది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అధిర్‌ రంజన్‌ చౌదరికి బలమైన పట్టున్న స్థానం ఇది. ఈ నేపథ్యంలో బహరామ్‌పుర్‌లో వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉన్నది. మరో ప్రముఖ మాజీ క్రికెటర్‌ అయిన కీర్తి ఆజాద్‌కు టీఎంసీ దుర్గాపూర్‌ టికెట్‌ కేటాయించింది. ఇక హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీకి అవకాశం కల్పించారు.

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న టీఎంసీ తాను అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాల్లో పోటీకి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగాలని పదేపదే తమ పార్టీ కోరుకున్నదని, అయితే టీఎంసీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించిందని విమర్శించారు. 

మమతపై కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా మమత పీఎంవోకు(ప్రధాని కార్యాలయం) ‘ఒక సందేశం’ పంపారని ధ్వజమెత్తారు. తన వంటి నాయకులను దేశంలోని ఏ రాజకీయ పార్టీ నమ్మకూడదని మమత నిరూపించారని మండిపడ్డారు. 

ఇండియా కూటమిలో కొనసాగితే, అది ప్రధాని మోదీకి నచ్చదనే భయం ఆమెలో ఉన్నదని, దీంతో కూటమి నుంచి దూరం పోవడం ద్వారా.. ‘నా పట్ల అసంతృప్తిగా ఉండొద్దు. నేను బీజేపీకి వ్యతిరేకంగా నిలబడటం లేదు’ అనే సందేశాన్ని మమత పీఎంవోకు ఇచ్చారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్‌ తీరుతో మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా కూటమికి దూరం అవుతున్నాయి. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇటీవలే బీజేపీ పక్షాన చేరారు. 

ఇక కేరళలో సీఎం విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ ప్రత్యర్థులుగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఒక కూటమిలో ఉంటుండగా రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్డిఎఫ్ ఆయనపై సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా భార్యనే పోటీకి దింపింది.

ఢిల్లీ, హర్యానా, గుజరాత్ లలో సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ కీలకమైన పంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ ఎవ్వరి దారి వారుగా మారింది. రెండు పార్టీలు ఎవ్వరికీ వారుగా అన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ముసలం మొదలైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే, ముంబై వాయువ్య సీటుకు శివసేన ఉద్ధవ్‌ వర్గం తాజాగా అభ్యర్థిని ప్రకటించడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరోవైపు జార్ఖండ్‌లో 14కిగానూ 8 స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని సీపీఐ ఆదివారం ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ చర్చలు జరుపడం లేదని, అందుకే సొంతంగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకొన్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర పాఠక్‌ తెలిపారు.