42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడబోయే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు 42 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు.  లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్‌లో ఎవరితోనూ పొత్తులు లేవని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లో పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది.
 
కాగా, మమతాబెనర్జీ ఇవాళ లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారం ప్రారంభించారు. కోల్‌క‌తా బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో మెగా ర్యాలీ ద్వారా ప్రచార శంఖారావాన్ని పూరించారు. జ‌న గ‌ర్జన స‌భ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీకి రాష్ట్ర నలుమూలల నుంచి ల‌క్షలాది మందిని టీఎంసీ స‌మీక‌రించింది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు బ‌కాయిలు విడుదల చేయ‌డంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని ఈ స‌భా వేదిక‌గా మ‌మ‌తా బెన‌ర్జీ విమర్శించారు. 
 
రాష్ట్రంలోని 42 లోక్‌స‌భ స్థానాల్లో బీజేపీని ఓడిస్తామని ఆమె స్పష్టం చేశారు. టీమిండియా మాజీ క్రికెట్ యూసుఫ్ ప‌ఠాన్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. యూసుఫ్ పఠాన్ బెహ‌రంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్న‌ట్లు మ‌మ‌త పేర్కొన్నారు. యూసుఫ్ పఠాన్ ఇవాళే మ‌మ‌త బెన‌ర్జీ స‌మ‌క్షంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అభ్యర్థుల జాబితాలో డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీకి టిక్కెట్ లభించగా, కృష్ణానగర్ నుంచి తిరిగి టీఎంసీ లోక్‌సభ బహిష్కృత నేత మహువా మొయిత్రాకు టిక్కెట్ దొరికింది. అసాంసోల్ నుండి శత్రుఘ్ను సిన్హా తిరిగి పోటీ చేస్తున్నారు.
 
ప్ర‌స్తుతం బెహ‌రంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు బెంగాల్‌లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన అధిర్ రంజ‌న్ చౌద‌రీ.. ఈసారి కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.
టీఎంసీ మెగా ర్యాలీకి దీటుగా అదే రోజు బీజేపీ భారీ కార్య‌క్ర‌మం చేప‌డుతోంది. టీఎంసీ నేత షాజ‌హాన్ షేక్ మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల నేప‌ధ్యంలో సందేశ్‌ఖాలిలో నిర‌స‌న ర్యాలీకి బిజెపి స‌న్న‌ద్ధ‌మైంది. కోల్‌క‌తా బ్రిగేడ్ ప‌రేడ్‌లో టీఎంసీ ర్యాలీని ఆ పార్టీ వీడ్కోలు ర్యాలీగా బీజేపీ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు.