మిస్‌ వరల్డ్‌-2024 గా చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టినా పిస్కోవా

71 వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు.  గతేడాది విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బియాలావ్‌స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా జరిగిన ఈ మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయి. 
 
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఈ మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీలు జరిగాయి. మొత్తం ప్రపంచంలోని 112 దేశాలకు చెందిన అందాల భామలు ఈ మిస్ వరల్డ్ 2024 పోటీ పడ్డారు. టాప్‌-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), యాస్మిన్‌ అజైటౌన్‌ (లెబనాన్‌), అచే అబ్రహాంస్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. 
 
చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్‌ వరల్డ్‌ కిరీటం క్రిస్టినాకు దక్కింది. రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్‌ నిలిచారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది.  భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా సిని శెట్టి ఈ అందాల పోటీల్లో మొదటి నాలుగు స్థానాల్లో కూడా నిలువలేకపోయింది.
 
ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చినా, అజైటౌన్‌ (లెబనాన్‌) టాప్‌-4కు ఎంపిక కావడంతో సినీ శెట్టి అక్కడి నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో 8వ స్థానం దక్కించుకుంది. పోటీ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడంలో సోషల్ మీడియా పాత్ర గురించి సినీని ప్రశ్నించాకం. ఆ క్రమంలో ఆమె స్పందన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమై ఉండవచ్చని తెలుస్తోంది. కర్నాటకకు చెందిన సిని శెట్టి 2022లో ఫెమినీ మిస్ ఇండియా 2022 కిరీటాన్ని గెలుచుకుంది.గతంలో ఇండియా ఆరుసార్లు ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకుంది. రీటా ఫరియా (1966), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (1994), డయానా హేడెన్ (1997), యుక్తా ముఖీ (1999), ప్రియాంక చోప్రా జోనాస్ (2000), మానుషి చిల్లర్ (2017). ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును అందుకున్నారు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌ ఉమెన్‌ జూలియా మోర్లీ ఈ అవార్డును ప్రదానం చేశారు.

చివరిసారిగా 1996లో భారత్‌లో ఈ విశ్వసుందరి పోటీలు జరగ్గా అందులో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా విజేతగా నిలిచారు. అప్పుడు భారత్ టాప్ 5 లో నిలిచింది. 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మిస్ వరల్డ్ పోటీలను ఎరిక్ మోర్లీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మొదటి సారి నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో స్వీడన్‌కు చెందిన కెర్‌స్టిన్ కికీ హకాన్సన్ విజేతగా నిలిచి విశ్వ సుందరి కిరీటాన్ని అందుకున్నారు.