కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ శనివారం ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. అరుణ్‌ గోయల్‌ పదవీ కాలం 2027 డిసెంబరు 5వ తేదీ వరకు ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అరుణ్‌ గోయల్‌ చేపట్టే అవకాశం కూడా ఉంది.

కానీ, ఆయన హఠాత్తుగా రాజీనామా చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. 2022 నవంబరులో ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామకం కూడా వివాదాస్పదమైంది. 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అరుణ్‌ గోయల్‌ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్‌కు కేవలం ఆరు వారాల వ్యవధి మిగిలి ఉండగా 2022 నవంబరు 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

 ఆ మరుసటి రోజే ఆయనను కేంద్రప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. దీనిని వ్యతిరేకిస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ.. ప్రభుత్వం మెరుపువేగంతో గోయల్‌ నియామకానికి ఆమోదం తెలపటాన్ని విచారణ సందర్భంగా ప్రశ్నించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023లోని సెక్షన్‌ 11లోని క్లాజ్‌ (1) ప్రకారం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ లేదా ఎలక్షన్‌ కమిషనర్‌ ఎప్పుడైనా తమ రాజీనామాను రాతపూర్వకంగా రాష్ట్రపతికి పంపవచ్చు. అరుణ్‌ గోయల్‌ కూడా రాజీనామా చేయడంతో ప్యానెల్‌లో సీఈసీ రాజీవ్‌కుమార్‌ మాత్రమే మిగిలారు.

అయితే, అరుణ్‌ గోయల్‌ రాజీనామాతో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల పోస్టులు ఖాళీగా మారాయి. ఇప్పటికే గత నెలలో రిటైర్ అయిన కమిషనర్ అనూప్ కుమార్ పాండే స్థానంలో ఎవ్వరిని నియమించలేదు. దానితో కేవలం ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ మాత్రమే మిగిలారు. ఈసీలో ఖాళీల నేపథ్యంలో కొత్త కమిషనర్ల నియామకానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.