మిజోరం అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్‌ గా టీవీ యాంకర్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాజకీయాల్లో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి తొలిసారిగా ఓ మహిళ స్పీకర్‌గా ఎంపికయ్యారు. జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగిని మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్‌లో స్పీకర్‌గా ఎంపికచేసుకున్నారు.

మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అగ్రనేత లాల్దుహోమా అన్నారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆమె మార్గం చూపారని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన మీజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్ లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు.  రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు.

రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పనిచేశారు.  మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె టెలివిజన్ యాంకర్‌గా పనిచేశారు. వన్నెహసాంగికి ఆకట్టుకునే సోషల్ మీడియా ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.