డ్ర‌గ్ మార్కెటింగ్ క‌జ‌గ‌మ్‌గా మారిన డీఎంకే

త‌మిళ‌నాడులో రూ. 2000 కోట్ల‌కు పైగా విలువైన డ్ర‌గ్ రాకెట్ బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డం రాజకీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. డ్ర‌గ్ రాకెట్ కేసులో శ‌నివారం డీఎంకే కార్య‌క‌ర్త‌ను అరెస్ట్ చేయ‌డంతో పాల‌క డీఎంకేపై బీజేపీ విరుచుకుప‌డింది. డీఎంకే ఇప్పుడు డ్ర‌గ్ మార్కెటింగ్ క‌జగమ్‌గా మారింద‌ని ఎద్దేవా చేసింది.

నిందితుడితో త‌మిళ‌నాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ త‌న‌కున్న సంబంధాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయాల‌ని బిజెపి డిమాండ్ చేసింది. అంత‌ర్జాతీయ డ్ర‌గ్ ట్రాపికింగ్ రాకెట్‌లో డీఎంకే బ‌హిష్కృత నేత జాఫ‌ర్ సాధిక్ (36)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శ‌నివారం అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఉదంతంపై బీజేపీ మ‌హిళా మోర్చా అధ్యక్షురాలు వ‌న‌తి శ్రీనివాస‌న్ స్టాలిన్ స‌ర్కార్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. నిందితుడితో స్టాలిన్ కుటుంబ స‌భ్యుల‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయ‌ని ఆమె పేర్కొన్నారు. 

జాఫ‌ర్ సాధిక్ నిర్మాత‌గా వ్య‌వ‌హరించిన ఓ సినిమాకు సీఎం ఎంకే స్టాలిన్ కోడ‌లు కిరుతిగ ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వం వ‌హించార‌ని ఆమె తెలిపారు. రాష్ట్ర మంత్రి, సీఎం కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్‌తో జాఫ‌ర్ ఎంతో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని ఆమె తెలిపారు.