![పెట్టుబడులలో మహిళా పారిశ్రామికవేత్తల పట్ల వివక్ష పెట్టుబడులలో మహిళా పారిశ్రామికవేత్తల పట్ల వివక్ష](https://nijamtoday.com/wp-content/uploads/2024/03/women-1024x614.jpg)
అన్ని రంగాల్లో సాధికారికత కోసం ముందడుగు వేస్తున్న మహిళలు ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో సహితం ధీటుగా రాణిస్తున్నారు. అయితే, అవసరమైన పెట్టుబడులు, నిధులను సమీకరించు కోవడంలో వివక్షతను ఎదుర్కోవలసి వస్తున్నట్లు వెల్లడవుతుంది. మదుపరుల విశ్వాసాన్ని చూరగొనడం, వారి నుంచి నిధుల సమీకరణ పొందడంలో అనేక అడ్డంకుల్ని చవిచూస్తున్నారు.
కంపెనీలు, ఇన్వెస్టర్లు మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారని, పురుషులపట్ల పక్షపాత ధోరణిని అవలంభిస్తున్నారని తాజా ఓ రిసెర్చ్‌లో తేలింది. 62 శాతం మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌కు ఈ అనుభవం ఎదురవుతున్నట్లు నిధుల వెల్లడైంది. ‘2022, 2023 మధ్య మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌లు సేకరించిన నిధులు 2.4 బిలియన్ డాలర్ల నుంచి 480 మిలియన్ డాలర్లకు పడిపోవడం ఇందుకు నిదర్శనం’ అని పిక్‌మైవర్క్ సహవ్యవస్థాపకురాలు కాజల్ మాలిక్ తెలిపారు.
కాగా, ‘అత్యుత్తమ సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం 2021తో పోల్చితే 2023లో 21 నుంచి 26 శాతానికి పెరిగింది. సామాజిక, ఆర్థిక పరమైన అవరోధాలను అధిగమించేలా మరింత చేయూత అందిస్తే మహిళా ఉద్యోగులు మరెన్నో విజయాలను సాధించగలరని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా సీఈవో యశస్వినీ రామస్వామి పేర్కొన్నారు.
‘మహిళా ఉద్యోగులను కంపెనీలు కూడా ప్రోత్సహించాలి. వారి వృత్తిగత లక్ష్యాల సాధనకు తగినవిధంగా సహకరిస్తూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది’ అని యెస్‌మేడమ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆకాంక్ష వైష్ణోయ్ చెప్పారు.
గడిచిన ఐదేండ్లకుపైగా కాలంలో దేశంలోని ఆయా కంపెనీల్లోని బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య క్రమేణా పెరిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది 18.3 శాతానికి వచ్చినట్టు శుక్రవారం విడుదలైన డెలాయిట్ నివేదిక స్పష్టం చేసింది. 2018లో ఇది 13.8 శాతమే. ‘వుమెన్ ఇన్ ది బోర్డ్‌రూమ్: ఏ గ్లోబల్ పర్‌స్పెక్టివ్’ పేరిట ఈ రిపోర్టు విడుదలైంది. అయితే ప్రపంచ సగటు 23.3 శాతంగా ఉన్నది.
కాగా, 50 దేశాల్లోని 18,000లకుపైగా సంస్థల బోర్డులను విశ్లేషించి ఈ నివేదికను డెలాయిట్ రూపొందించింది. ఇందులో 400 భారతీయ కంపెనీల బోర్డులనూ పరిశీలించారు. ఇదిలావుంటే 2018తో పోల్చితే 2023లో మహిళా సీఈవోలు 3.4 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగారు. రంగాలవారీగా అత్యధికంగా దేశీయ లైఫ్‌సైన్సెస్-హెల్త్‌కేర్ సంస్థల్లోనే మహిళా డైరెక్టర్లు 21.3 శాతంగా ఉన్నారు.
రెండో స్థానంలో టెక్నాలజీ, మీడియా, టెలీకమ్యూనికేషన్స్ కంపెనీల బోర్డుల్లో మహిళలు 20.5 శాతంగా ఉన్నారు. ఆ తర్వాత కన్జ్యూమర్ బిజినెస్ (19.7 శాతం), తయారీ (17.4 శాతం), ఆర్థిక సేవల (16.9 శాతం) సంస్థలున్నట్టు డెలాయిట్ ఈ నివేదికలో పేర్కొన్నది.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!