ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది
 
* కాకినాడ నుండి లోక్‌సభకు పవన్ కళ్యాణ్ పోటీ!
 
మూడ్రోజులుగా ఢిల్లీ వేదికగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌నివారం జరిపిన భేటీలో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పొత్తు గురించి ఓ నిర్ణయానికి వచ్చారు. అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై ప్ర‌ధానంగా చ‌ర్చ కొన‌సాగింది. 
 
ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరిన‌ట్లు ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించారని, త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉందిని తెలుస్తున్నది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని టీడీపీ భావిస్తోంది. ఏపీ, దేశ ప్ర‌యోజ‌నాల కోసం క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.
 
ఇలా ఉండగా, ఈ భేటీ అనంతరం అమిత్ షా సూచనపై కాకినాడ నుండి లోక్‌సభకు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేయడం ద్వారా ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.  ఎమ్యెల్యేగా పిఠాపురం నుండి పోటీ చేసినా  లోక్‌సభకు కూడా పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.  ఎంపీగా పోటీచేస్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ప్రభావితం చేయవచ్చన్నది అంచనా వేస్తున్నారు.
 
ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటనే చేశారు. పర్యటన అనంతరం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..? బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నామనే విషయాలపై చర్చించారు. ‘ఎన్డీఎలోకి మనం వెళుతున్నాం.. సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. పొత్తులపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్‌సభ సీట్లు ఇచ్చాం’ అని పార్టీ సహచరులకు వెల్లడించారు. 
 
బీజేపీ, జనసేనతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లలో ఏపీని వైఎస్ జగన్‌ దివాళా తీయించారని, ఈ పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర సహకారం చాలా అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్,  విభజన హామీలు నెరవేర్చడం, అరాచక పాలనను అంతమొందించడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని వివరించారు. 
 
శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు సోమవారం మిగతా అభ్యర్దుల జాబితా ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. పార్టీలో టిక్కెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే సీనియర్లు పిలిపించి మాట్లాడండని సీనియర్లు, ముఖ్యనేతలకు చంద్రబాబుకు కీలక సూచనలు చేశారు.
 
కాగా.. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ వరుస భేటీలతో అందరి చూపు ఢిల్లీపైనే పడింది. పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బిజెపి తనకు ఎక్కువ లోక్‌స‌భ  స్థానాలు కావాలని పట్టుబట్టడంతో తనకు కేటాయించిన మూడు స్థానాలలో ఒక దానిని బిజెపికి ఇచ్చి, జ‌న‌సేన 2 స్థానాల్లో మాత్రమే బ‌రిలో దిగ‌నున్న‌ట్లు స‌మాచారం. 
 
ఇక మిగిలిన 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగు దేశం పోటీ చేయ‌నుంది. ఇక 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తుంద‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాన్‌, చంద్ర‌బాబు క‌లిసి ప్ర‌క‌టించారు. తాజాగా బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంది. మిగిలిన 145 స్థానాల్లో టీడీపీనే బ‌రిలో దిగ‌నుంది. 
 
అయితే బీజేపీ వైజాగ్, విజ‌య‌వాడ‌, అర‌కు, రాజంపేట్, రాజ‌మండ్రి, తిరుప‌తి స్థానాలపై దృష్టి పెట్టింది. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 సీట్లు కైవ‌సం చేసుకునే దిశ‌గా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌తో పొత్తులు కుదుర్చుకుంటోంది బీజేపీ.