కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది 5 ఏళ్లలో చేసి చూపించాం

* ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలోని సెలా టన్నెల్‌ జాతికి అంకితం 
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి 20 ఏండ్లు పట్టేదని మోదీ ఎద్దేవా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ   దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో మన వాణిజ్య, పర్యాటక తదితర సంబంధాలకు ఈశాన్య భారత దేశం బలమైన లింకుగా మారబోతున్నదని చెప్పారు. 
 
ఇవాళ ఇక్కడ రూ.55,600 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందని చెబుతూ ఒకసారి అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే ఒకాయనకు మోదీ గ్యారంటీ అంటే ఏమిటో స్పష్టంగా అర్థమవుతుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు చేయడానికి కాంగ్రెస్‌కు రెండు దశాబ్దాలు పట్టేదని ఎద్దేవా చేశారు.

తాము దేశం అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ప్రతిపక్ష కూటమి తమపై దాడులు చేస్తోందని ప్రధాని విమర్శించారు. “ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులతో ఈశాన్య భారతం వాణిజ్యం, పర్యాటక రంగాల్లో దూసుకుపోనుంది. దక్షిణ, తూర్పు ఆసియాలతో ఈ ప్రాంతానికి సంబంధాలు బలపడనున్నాయి. కాంగ్రెస్ నేతలు ఇక్కడ పర్యటించి మేం చేసిన అభివృద్ధి చూడాలి. నేను హామీ ఇచ్చాక అమలు చేయడానికి ఎంత దూరం వెళ్తానో ప్రజలకు తెలుసు. ఓ వైపు దేశాభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటే విపక్ష ఇండియా కూటమి నేతలు నాపై ఎదురుదాడి చేస్తున్నారు” అని మోదీ పేర్కొన్నారు.

గత 10 ఏళ్లలో 6 వేల కి.మీ కంటే ఎక్కువ జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 10 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని మాత్రమే నిర్మించిందని ప్రధాని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మిషన్ పామ్ ఆయిల్’ను ప్రారంభించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మిషన్ కింద మొదటి ఆయిల్ మిల్లు ప్రారంభించబడిందని, దీని ద్వారా ఇక్కడి రైతుల ఆదాయం పెరుగుతుందని వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో (13000 అడుగులు) నిర్మించిన  పొడవైన సొరంగం డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని మోదీ ఈటానగర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్, తవాంగ్ జిల్లాలను కలుపుతుంది. వాస్తవాధీన రేఖకు చేరుకోవడానికి ఇదే ఏకైక మార్గం కావడం విశేషం.

ప్రధాని మోదీ అంతకు ముందు అస్సాంలోని కజిరంగ నేషనల్‌ పార్ట, టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. జీవు సఫారీ చేశారు. ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించారు. దీంతో 1957లో కజిరంగ జాతీయ పార్కుకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు లభించిన తర్వాత దేశ ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి.