బిజెపిలోకి కేంద్ర మాజీ మంత్రి సురేశ్‌ పచౌరీ

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్, కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి బీజేపీలోకి చేరుతున్నారు. తమ నేతల్ని కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. 
 
మధ్యప్రదేశ్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి సురేశ్‌ పచౌరీ కమలం పార్టీలోకి చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌, మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు విశాల్ పటేల్, సంజయ్ శుక్లా‌తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సురేశ్ పచౌరీ  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశానికి తనవంతు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, కుల, వర్గ భేదాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. కానీ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవని మండిపడ్డారు. 

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకను తిరస్కరించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన భాష తనని ఎంతో నిరాశపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆహ్వానాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ చెప్పినట్లు కాంగ్రెస్‌ పూర్తిగా అంతమైనప్పుడే రాహుల్‌ ఊపిరి పీల్చుకుంటాడని ఎద్దేవాచేశారు. నాయకత్వ లేమితో సమతమవుతున్న ఆ పార్టీ నుంచి మంచి నాయకులంతా ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారని చెప్పారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై సురేశ్ పచౌరీ బీజేపీలో చేరారని రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుదత్ శర్మ చెప్పారు.

ఇదిలావుండగా.. గాంధీల కుటుంబానికి సురేశ్‌ పచౌరీ అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్‌ హయాంలో కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రిగానూ, నాలుగుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్త గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఆయన పని చేశారు. 

అలాంటి కీలక నేత పార్టీని వీడడం  కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలినట్లయ్యింది. బీజేపీలో ఆయన చేరిక ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతోంది. కొన్ని జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆయన అడుగుజాడల్లోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.