అతిపెద్ద విజయగాధ మహిళా స్వయం సహాయక బృందాలు

“ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు, మనం ఒక ప్రత్యేకమైన విజయగాథను జరుపుకుంటున్నాము: భారతదేశంలోని శక్తివంతమైన స్వయం-సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) నుండి మహిళా నాయకులది. వారిది ఆశ, విజయంల నిజమైన కధనం. ఇది మహిళా శక్తి – ఆపలేనిది, దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులను నడిపించేది” అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్ఇ) డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణన్ తెలిపారు.
 
నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ నుండి కమ్యూనిటీ కిచెన్‌లు,మురికివాడల అభివృద్ధి వరకు ప్రతిదానిని నిర్వహించడానికి ఈ బృందాలు కొత్త సహకార సంఘాలుగా మారుతున్నాయని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిఎస్ఇ జరిపిన ఒక వెబ్‌నార్‌లో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు.
ఈ వెబ్‌నార్‌  నిర్వహణలో సహాయకారిగా ఉన్న ప్రముఖ పర్యావరణ పక్ష పత్రిక  `డౌన్ టు ఎర్త్’ స్వయంసేవక బృందాల విజయగాథపై ఓ ముఖచిత్ర కధనాన్ని ప్రచురించింది. ఈ కధానాలలో కనిపించిన పలువురు మహిళా నాయకులు, వ్యాపారవేత్తలు ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్నారు. 
 
వారిలో డాక్టర్ మీను సింగ్, డైరెక్టర్, ఐఐఎంఎస్, రిషికేశ్; హీనాబెన్ దవే, వైస్ ప్రెసిడెంట్, సేవా (స్వయం ఉపాధి మహిళా సంఘం), అహ్మదాబాద్; మీనా రహంగ్‌డేల్, ప్రెసిడెంట్, యోగ్యతా స్వ సహాయతా సముహ్, బాలాఘాట్ (మధ్యప్రదేశ్); మినీ వర్గీస్, మెంటర్ రిసోర్స్‌పర్సన్, కుటుంబశ్రీ, కేరళ; పద్మా తాషి, ప్రొడక్షన్ మేనేజర్, లూమ్స్ ఆఫ్ లడఖ్ ఉమెన్స్ కోఆపరేటివ్, లేహ్; సబితా బెహెరా, జల్ సాథి, పూరి (ఒడిశా) ఉన్నారు.
 
స్వయం సహాయక బృందం అనేది సాధారణంగా ఒకే విధమైన సామాజిక-ఆర్థిక నేపథ్యం నుండి 10-12 మంది మహిళల సంఘం. ఈ మహిళలు ఉమ్మడి ఆర్థిక కార్యకలాపాలను చేపట్టేందుకు లేదా చిన్న వ్యాపారాలను ప్రారంభించేందుకు సభ్యులకు సహేతుకమైన వడ్డీ రేటుకు నగదును అందించడానికి తమ ఆర్థిక వనరులను సమీకరించుకోవడానికి పొత్తులను ఏర్పరుచుకుంటారు.
 
దీనదయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ డిసెంబర్ 2023లో విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో 90 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయి, దాదాపు 10 కోట్ల మంది మహిళలు సభ్యులుగా  దేశంలో 6.5 లక్షల గ్రామాలతో (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్నారు. అంటే, సగటున ప్రతి గ్రామానికి 14 స్వయం సహాయక బృందాలు ఉండగా, దేశంలోని మహిళలో ప్రతి ఎనిమిదవ భారతీయ మహిళ ఈ బృందాలలో సభ్యురాలిగా ఉన్నారు. 
 
`డౌన్ టు ఎర్త్’ పత్రిక అంచనా ప్రకారం ప్రతి బృందం ఎనిమిది నుండి 10 మంది మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడంలో సహాయపడుతుంది. భారతదేశంలో1970వ దశకం నుండే ఈ బృందాల ఏర్పాటు ప్రారంభమైంది.  వాటిలో అత్యంత ముఖ్యమైనది `సేవా’ (స్వయం ఉపాధి మహిళల సంఘం)  గుజరాత్‌లో రూపుదిద్దుకుంది.
 
1992లో, ఈ సమూహాలు బ్యాంక్ లింకేజ్ ప్రాజెక్ట్ (ఎస్ హెచ్ జి – బి ఎల్ పి) కింద బ్యాంకులకు అనుసంధానించబడ్డాయి. జీవనోపాధి అవకాశాల ఏర్పాటు కోసం చిన్న రుణాల పంపిణీని ప్రారంభించడానికి ఇది జరిగింది. 1999లో ప్రభుత్వం తన స్వర్ణ్ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి వాటిని ఉపయోగించాలని నిర్ణయించినప్పుడు ఈ సమూహాలు మరింత ఊపందుకున్నాయి.
 
తరువాతి సంవత్సరాల్లో, ఈ బృందాలు భారతదేశపు  కీలకమైన అభివృద్ధి అజెండాకార్యనిర్వాహకులుగా చేయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలతో  మరింత బలంగా మారాయి. 2014లో, ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని (కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్) సృష్టించింది. 
 
ఇది స్థానిక జీవనోపాధి కార్యక్రమాలను నిర్ణయించడానికి, రూపొందించడానికి సంవత్సరానికి రూ. 50,000 వరకు ఈ బృందాలకు అందిస్తుంది.  “నేడు, భారతదేశపు స్వయం సహాయక బృందాలు సమిష్టిగా ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోఫైనాన్స్ ప్రాజెక్ట్‌గా పరిగణించబడుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక డేటా ప్రకారం, ఫిబ్రవరి 2024 వరకు, ఈ గ్రూపులు రూ. 1.7 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేశాయి” అని సునీతా నారాయణన్ తెలిపారు.
 
ఈ బృందాలు ఇచ్చే రుణాలు చాలా అరుదుగా దుర్వినియోగం అవడం లేదా మాఫీ చేయాల్సి రావడం జరుగుతుంది.  2022-23 భారత దేశ ఆర్ధిక సర్వే ప్రకారం స్వయం సహాయక బృందాలు బ్యాంకులకు రుణాల చెల్లింపు రేటు 96 శాతానికి పైగా ఉండటం వారి క్రెడిట్ క్రమశిక్షణ, విశ్వసనీయతను వెల్లడిస్తోందని ఆమె వెల్లడించారు. 
 
 డౌన్ టు ఎర్త్ మేనేజింగ్ ఎడిటర్ రిచర్డ్ మహాపాత్ర ఇలా చెప్పారు: “పురుష ఆధిపత్య సమాజంలో, స్త్రీలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. కానీ ఎన్నడూ గుర్తించబడరు, స్వయం సహాయక బృందాలలో సభ్యురాలిగా ఉండటం గౌరవపు బ్యాడ్జ్. మహిళా శక్తికి  కొత్త గుర్తింపు ప్రకటనగా మారింది. ఎస్ హెచ్ జి లు  అటువంటి సమూహాలు ఎలా నిర్వహించబడుతున్నాయి? డెలివరీ చేయడం అసాధ్యం అనిపించిన అభివృద్ధి పనులను ఎలా కొనసాగించాయి? అనేదానికి అత్యుత్తమ ఉదాహరణలను అందిస్తాయి”.