హామీల అమలుకు షరతులతో దగా చేస్తున్న కాంగ్రెస్

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో ప్రజలను వంచించే విధంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయకుండా నిబంధనలు, షరతుల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నది.
 
 ప్రభుత్వం అమలు ప్రకటించిన రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు – రెండు గ్యారెంటీల్లోనూ అర్హులైన లబ్ధిదారులను తగ్గించేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందిస్తున్నది.  రాష్ట్రంలో 1.24 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వాటిలో 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 40 లక్షల మందికే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామంటున్నారు. 
 
మిగిలిన వారి సంగతి గురించి ప్రభుత్వం పెద్దల నుండి సమాధానం లేదు. పైగా, దానిలో కూడా ఏడాదికి 3 సిలిండర్లు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? వినియోగదారుడు మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్‌ తీసుకోవాలని, తర్వాత వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామనే నిబంధన పెట్టారు.
 
అసలు ప్రజా పాలన కింద ఎంతమంది రూ. 500కే సిలిండర్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదు. తెల్లరేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో కూడా చెప్పడం లేదు.  కేసీఆర్ హయాంలో కొత్తగా రేషన్ కార్డులు అర్హులైన లక్షలాదిమందికి ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలో ఒక వంక చెబుతున్నారు. తమ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ఎప్పుడు కార్డులు ఇస్తారో మాత్రం పెదవి విప్పడం లేదు.
 
ఎన్నికల సమయంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ రూ.500కే సిలిండర్ పథకం వర్తింపజేయాలని గొప్పగా హామీల వర్షం కురిపించారు. ఇప్పుడేమో ఈ పధకాన్ని ఏవిధంగా నిర్వీర్యం చేయాలో ఆలోచనలు చేస్తున్నారు. పధకం అమలులో ప్రభుత్వంలో నిజాయితీ కనిపించడం లేదు. అదే విధంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారందరికీ  ఉచిత విద్యుత్ ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పి, ఇప్పుడేమో మాట మారుస్తున్నారు.
 
ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడేమో ఎన్నికల తర్వాత నిబంధనల పేరుతో అర్హులను తగ్గించే కుట్ర జరుపుతున్నారు. రాష్ట్రంలో 1.31 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడుకునేవారు 1.05 కోట్ల మంది ఉన్నారు. వీరందరికి ఉచిత విద్యుత్ అందిస్తారా? లేదా? తేల్చాల్సి ఉంది.
 
మరోవంక, కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే విద్యుత్ కోతలకు తలుపులు తెరిచినట్లే అని  ప్రజలు భయపడుతున్నారు.  అయితే ఇదంతా కుట్ర పన్నారని అంటూ ముఖ్యమంత్రి  రేవంత్ రడ్డి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ కొత్త విధిస్తే కొలువులు తీసేస్తా అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. విద్యుత్ కోతలకు ఉద్యోగులను బాధ్యులను చేస్తానంటున్న ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కూడా చర్య తీసుకోగలరా?
 
సమ్మక, సారలమ్మ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడినట్లు స్పష్టం అవుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇది ప్రజలను మోసగించడం, తప్పుదోవ పట్టించడమే అవుతుంది. వీటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎప్పుడు పరీక్షలు పెట్టారో రేవంత్‌ సమాధానం చెప్పగలరా?
 
ఎన్నికలు కాగానే, డిసెంబర్ 9 నాటికి రైతుల ఖాతాలలో రైతు బంధు నిధులు జమ అవుతాయని చెప్పిన ముఖ్యమంత్రి మూడు నెలలు అవుతున్నా ఆ విషయమై స్పష్టత ఇవ్వడం లేదు. తమ ప్రభుత్వంలో కౌలు రైతులకు కూడా రైతు బంధు వర్తింప చేస్తామని చెప్పారు. ఇప్పుడా విషయం గురించి ప్రస్తావించడం లేదు. పైగా, రైతు బంధు నిబంధనలను కూడా మార్చి ఆ పధకాన్ని సహితం వీలైనంత మేరకు కుదించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
 
మరోవంక తమ ఉపాధికి ముప్పు ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతుంటే వారిని సముదాయించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదు. వారి సంక్షేమం కోసం తమ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు పరచే ప్రయత్నం చేయడం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆటోడ్రైవర్లు ఇప్పటిదాకా 30 మంది చనిపోయారు. వారికి ఎవ్వరు బాధ్యత వహిస్తారు?