మణిపూర్‌లో మరో ఆర్మీ అధికారి అపహరణ

తెగల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్‌ లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఆగంతకులు ఆయనను తన ఇంటి నుంచే అహపరించుకుని పోయారు. గత మే నెలలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి ఇది నాలుగో కిడ్నాప్ కావడం గమనార్హం.  దౌబల్ జిల్లా నివాసి అయిన జూనియర్ కమిషన్డ్ అధికారి కాన్సమ్ ఖేడ సింగ్‌ను శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అతని ఇంటి వద్ద నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. 

సమాచారం అందిన వెంటనే జేసీఓను కాపాడేందుకు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టామని, 102వ జాతీయ రహదారిపై అన్ని వాహనాలను తనిఖీ చేశామని భద్రతాధికారులు తెలిపారు. ఖేడ సింగ్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియలేదని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు.

గతేడాది మే 2023 నుండి ఇది నాలుగో సంఘటన. సెలవుల్లో ఉన్న సైనికులు, విధుల్లో ఉన్నవారు లేదా వారి బంధువులను లక్ష్యంగా చేసుకుంటున్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 2023లో అస్సాం రెజిమెంట్‌ మాజీ సైనికుడు సెర్టో తంగ్‌తంగ్‌కోమ్‌ని గుర్తు తెలియని సాయుధ బృందం కిడ్నాప్‌ చేసింది. అతను కూడా సెలవుల్లో ఉండి తన ఇంట్లో ఉన్నప్పుడే కిడ్నాప్‌కి గురయ్యాడు.

 ఆ తర్వాత రెండు నెలల తర్వాత చురాచంద్‌పూర్‌ నుండి లీమాఖోంగోకు ఎస్‌యూవీలో ప్రయాణిస్తుండగా గుర్తుతెలియని సాయుధ బృందం నలుగురు వ్యక్తుల్ని కిడ్నాప్‌ చేసి చంపింది. ఆ నలుగురు జమ్మూకాశ్మీర్‌లో పనిచేస్తున్న భారత ఆర్మీ సైనికుని కుటుంబ సభ్యులే. ఇక ఈ ఏడాది  ఫిబ్రవరి 27న ఇంఫాల్ సిటీ నుంచి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒకరిని సాయుధులు కిడ్నాప్ చేశారు. దీనికి నిరసనగా మణిపూర్ పోలీస్ కమెండోలు ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లో ‘ఆర్మ్స్ డౌన్’ నిరసన సైతం తెలిపారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తుల్ని అరాంబై టెంగోల్‌లో పోలీసులు గుర్తించారు.