* నిలువు దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ ట్యాంకర్లు
కర్ణాటక రాజధాని బెంగళూరులో తాగునీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొంది. మార్చిలోనే నీటి కష్టాలు మొదలవడంతో నగర వాసులు అల్లాడిపోతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది.
నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బెంగళూరు గొంతెండుతున్నది. నగరంలో రోజుకు 2,600 నుంచి 2,800 ఎంఎల్‌డీ నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్‌డీ నీ రు మాత్రమే సరఫరా అవుతున్నది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు.
మరోవైపు వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోతున్నాయి. స్ధానికులు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటంతో అధిక ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొంది. నీటి కోసం పొడవాటి క్యూల్లో వేచిఉండాల్సి వస్తోందని ఆర్ఆర్ నగర్ వాసులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు.
కొద్దిపాటి నీటితోనే ఇంట్లో వారంతా సర్దుకోవాల్సి వస్తోందని అంటున్నారు. స్నానం చేసేందుకు, వంట చేసుకునేందుకు కూడా తగినంత నీరు ఉండటం లేదని ఆర్ఆర్ నగర్‌కు చెందిన మహిళ దివ్య నీటి కష్టాలను ఏకరువు పెట్టారు. గత మూడు నెలలుగా నీటి కొరత వెంటాడుతోందని తాము నిత్యం బీఎండబ్ల్యూఎస్ఎస్‌బీ (బెంగళూర్ నీటి సరఫరా, సీవరేజ్ బోర్డ్) అధికారికి ఫోన్ చేస్తున్నా ఫలితం లేదని చెప్పారు.
తాను ప్రతిరోజూ తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్‌కు వస్తున్నానని, ఇక్కడకు కేవలం ఒక వ్యక్తినే అనుమతిస్తున్నారని గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని వివరించారు. కనీస అవసరమైన నీటి కోసం స్థానికులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఇదే అదునుగా కొందరు సొమ్ము చేసుకుంటూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
అనేక ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు నీటి పంపిణీ కోసం నివాసితుల నుంచి విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. గతంలో రూ.600 ఉన్న నీటి ట్యాంకర్ ధరను అమాంతం రూ.2వేలకు పెంచేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.3వేలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. అది కూడా బుక్ చేసుకున్న 3-4 రోజులకు సరఫరా అవుతున్నది.
ఈ నేపథ్యంలోనే ట్యాంకర్ల దోపిడీకి చెక్‌పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్యాంకర్లకు కచ్చితమైన ధరను నిర్ణయించింది. బెంగళూరు నగరానికి నీటిని సరఫరా చేసేందుకు దాదాపు 200 ప్రైవేటు ట్యాంకర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికను నియమించింది.
బీఎండబ్ల్యూఎస్ఎస్‌బీ (బెంగళూర్ నీటి సరఫరా, సీవరేజ్ బోర్డ్) విజ్ఞప్తి మేరకు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ ట్యాంకర్ రేట్లను ప్రామాణికం చేశారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లు రవాణా చేసే నీటి పరిణామం, ప్రయాణించిన దూరం ఆధారంగా ధరలను నిర్ణయించారు. కొత్త నిబంధనల ప్రకారం.. 5 కిలోమీటర్ల పరిధి దూరానికి 6 వేల లీటర్ల నీటి ట్యాంకర్ ధర రూ.600గా నిర్ణయించారు.
అదేవిధంగా 8 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.700, 12,000 లీటర్ల ట్యాంకర్ ధర రూ.1,000గా నిర్ణయించారు. 5 కిలోమీటర్ల మించి ప్రయాణిస్తే దూరానికి అనుగుణంగా రేట్లు పెరుగతూ వస్తాయి. అయితే, ప్రైవేట్ ట్యాంకర్లను ధర తగ్గించాలని ప్రభుత్వం కోరిన తర్వాత వారు తమ ప్రాంతానికి రావడం నిలిపివేశారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను ప్రతిరోజూ ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపుతున్నా స్పందన లేదని వాపోతున్నారు.
బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వందలాది గ్రామాల్లో తాగునీటికి ఇప్పటికీ తీవ్ర కొరత ఉంది. వేసవి తీవ్రం అవుతున్నా కొద్ది మరిం త నీటి కటకట తప్పదని, దాదాపు 7,000 గ్రామాల్లో తాగు నీటి కొరత రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు తాగునీరు కూడా అందడం లేదు. తిన్న తర్వాత చేతులు కడిగేందుకు కూడా నీళ్లు దొరకడం లేదు. దీంతో అనివార్యంగా సెలవులు ఇస్తున్నారు.
నీటి కొరత గురించి నిపుణు లు ముందే హెచ్చరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభు త్వం అశ్రద్ధ చేయడంతోనే ఈ పరిస్థితి వ చ్చిందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. వారం రోజుల్లో నీటి కొరతను నివారించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు