సరిహద్దుల్లో దాడి చేస్తే తిప్పికొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధం

* చైనాకు రాజ్‌నాథ్ పరోక్షంగా హెచ్చరిక
 
భారతదేశానికి సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా అంతే దీటుగా స్పందించేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. మన దేశానికి సరిహద్దుల్లో నిత్యం రకరకాల సవాళ్లు ఎదురవుతుండగా  వాటికి గట్టిగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ తేల్చి చెప్పారు. 
 
ఎన్‌డిటివి నిర్వహించిన డిఫెన్స్ సమ్మిట్‌లో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్  గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వింపులు, ఆక్రమణలు, సైనిక పోస్టుల నిర్మాణాలు, సరిహద్దుల్లోకి భారీగా సైన్యం మోహరింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ చైనాకు పరోక్షంగా గట్టి హెచ్చరిక చేశారు. భారత్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని, బలంగా తిప్పికొట్టే సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు.
 
మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి గుణపాఠం చెప్పేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. తూర్పు లడఖ్‌లో చైనాతో సుమారు నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న సరిహద్దు వివాదం, హిందు మహాసముద్రంలో చైనీస్ మిలిటరీ ప్రవేశంపై ఆందోళనల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి ఆ ప్రకటన చేశారు. 
 
దేశ రక్షణ వ్యవస్థకు ప్రజల దూరదృష్టికి అనుగుణంగా ప్రభుత్వం ‘కొత్త శక్తి సమకూర్చింది ’ అని, దృఢమైన, స్వయం సమృద్ధ సైన్యంతో ప్రపంచ వేదికపై శక్తిమంతమైన దేశంగా భారత్ ఆవిర్భావానికి అది దారి తీసిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దులో ఎలాంటి ఉద్రిక్తతలు ఎదురైనా వాటికి సరైన సమాధానం ఇచ్చేందుకు భారత సైన్యం, నౌకాదళం, వాయు సేన ఎల్లప్పుడూ సంసిద్ధతతో ఉన్నట్లు వివరించారు. 
 
శాంతి సమయంలోనూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు జరుగుతున్న వేళ రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.  భూమి, సముద్రం, ఆకాశం.. ఇలా ఏ వైపు నుంచి భారత్‌పై శత్రువులు దాడి చేసినా వాటిని తిప్పికొట్టేందుకు భారత త్రివిధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి చెప్పారు.
 
 ఏ దేశ భూభాగాన్ని భారత్ ఆక్రమించలేదని, అదే సమయంలో మన దేశ భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించినా, మన దేశంపై దండయాత్రకు వచ్చినా వారికి రివర్స్ కౌంటర్ ఇచ్చే బలమైన స్థితిలో ఉన్నామని వెల్లడించారు.  భారత్ ఇప్పుడు బలహీనమైన దేశం కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.  భారత్‌పై ఏ దేశమైనా కన్నెర్ర చేసి మన నుంచి తప్పించుకునే పరిస్థితి ఇప్పుడు లేదని పరోక్షంగా చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టి హెచ్చరికలు చేశారు.
ఈ సందర్భంగానే గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో గతంలో జరిగిన ఘర్షణలను గుర్తు చేసిన రాజ్‌నాథ్ ఆ సమయంలో భారత సైనికులు చూపించిన అసమాన పోరాటాన్ని కొనియాడారు.  భారత సైన్యం తెగువను గుర్తు చేసిన రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం మనం బలహీనంగా లేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే 2014 తర్వాత భారత రక్షణ రంగం మరింత బలోపేతం అయిందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు.
 
‘భారతీయత భావంతో’ దేశ రక్షణ వ్యవస్థను మరింత బలిష్టం చేయడంపై మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినందున అది ఎప్పటికన్నా మరింత దృఢంగా ఉందని చెప్పారు. ప్రస్తుత, పూర్వపు ప్రభుత్వాల మధ్య ప్రధాన అంతరం ‘దృక్పథమే’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భారత ప్రజల సామర్థాలను గట్టిగా విశ్వసిస్తున్నదని, కాని గతంలో అధికారంలో ఉన్నవారు ప్రజల శక్తిపై ఒకింత సందేహంతో ఉండేవారని రాజ్‌నాథ్ వివరించారు.
 
 ‘ఇప్పుడు కేంద్రంలోని శక్తిమంతమైన నాయకత్వం వల్ల మన దళాలు దృఢచిత్తంతో ఉన్నాయి. సైనికుల నైతిక స్థైర్యం ఉన్నతంగా ఉండేలా మేము నిరంతరం కృషి చేస్తున్నాం’ అని మంత్రి చెప్పారు. ‘భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహిస్తూ.. భారత్‌లోనే అధునాతన ఆయుధాలు, డిఫెన్స్ పరికరాల తయారీతోపాటు సైన్యం ఆధునికీకరణపైనా దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను తీసుకొచ్చామని రాజ్‌నాథ్ చెప్పారు.