రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దుతో జమ్మూకశ్మీరు సంకెళ్లు తెగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్వేచ్ఛావాయువులు పీలుస్తోందని.. అభివృద్ధిలో నూతన శిఖరాలను అందుకుంటోందని చెప్పారు. ‘వికసిత్ భారత్-వికసిత్ జమ్మూకశ్మీరు’ పేరిట గురువారం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియం వద్ద నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఆర్టికల్ 370పై కాంగ్రెస్ దేశాన్ని తప్పుదారి పట్టించిందని, దీని వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని విమర్శించారు.
2019లో 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీరు, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చాక ఆయన శ్రీనగర్ రావడం ఇదే మొదటిసారి. వ్యవసాయ-ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే రూ.5 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. వీటితో జమ్మూకశ్మీరు మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ కశ్మీరీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజల హృదయాలు గెలుచుకోవడానికి తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. 370 రద్దుతో కశ్మీరీ యువతకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభించిందని, కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారని మోదీ తెలిపారు. వారికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
‘ఇవాళ అందరికీ సమాన హక్కులు, సమాన చాన్సులు వస్తున్నాయి. జమ్మూకశ్మీరు దేశానికి మణికిరీటంలాంటిది. పర్యాటక రంగ అభివృద్ధి, రైతుల సాధికారత, యువ నాయకత్వంతో ఈ ప్రాంతం అభివృద్ధి పథాన నడుస్తుంది. ఇది కేవలం ఓ ప్రాంతం కాదు. దేశానికి తలవంటిది. ఇక్కడ 40 పర్యాటక ప్రాంతాలను గుర్తించాం’ అని ప్రధాని వెల్లడించారు.
కాగా, ప్రధానంగా జమ్మూకశ్మీర్‌లో ‘వెడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యం ప్రధాని తెలిపారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులకు ఈ సందేశం ఇస్తున్నట్లు చెప్పారు. అలాంటి వారు జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. అలా చేయడం ద్వారా ప్రతి వ్యక్తి వారి పర్యటన నిమిత్తం బడ్జెట్‌లో కనీసం 5-10 శాతం స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఇక్కడి ప్రజల ఆదాయం పెరిగి, ప్రజలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ కుటుంబ రాజకీయాలకు బలైందని పేర్కొంటూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలపైనే దృష్టిపెట్టాయని, అవినీతిని ప్రోత్సహించాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. తనకు కుటుంబం లేదని ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను మోదీ మళ్లీ ప్రస్తావించారు. యావత్ జమ్మూకశ్మీరు ప్రజలు తన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి ఏమైనా చేస్తానని చెబుతూ ప్రజలకు మహాశివరాత్రితో పాటు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రూ.1,400 కోట్ల విలువైన ‘స్వదేశీ దర్శన్’, ‘ప్రసాద్’ స్కీంలు, హజ్రత్‌బాల్ దర్గా సమగ్రాభివృద్ధి పథకాలు కూడా ఉన్నాయి. కొత్తగా జమ్మూకశ్మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన 1,000 మందికి మోదీ నియామక పత్రాలు అందజేశారు.
శంకరాచార్య హిల్‌కు మోదీ ప్రణామం
శ్రీనగర్ పర్యటనలో మోదీ తొలుత ఇక్కడి ప్రసిద్ధ ‘శంకరాచార్య హిల్’’కు చేతులు జోడించి ప్రణామం చేశారు. ఆ ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. శ్రీనగర్‌లోని జబర్వాన్ కొండలపైన ఆదిశంకరాచార్య ఆలయం ఉంది. ఏటా ఏప్రిల్‌లో ఆలయ ప్రతిబింబం దాల్ సరస్సులో కనువిందు చేస్తుంది. కాగా, తన ‘మిత్రుడు నజీంతో చిరస్మరణీయ సెల్ఫీ’ అంటూ మోదీ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ‘నజీం చేసే గొప్ప పని నన్ను ఎంతగానే ప్రభావితం చేసింది’ అని ట్వీట్ చేశారు. పుల్వామాకు చెందిన నజీం 2018 నుంచి తేనె వ్యాపారం చేస్తున్నారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు