రాజ్యసభకు నామినేట్‌ అయిన సుధామూర్తి

ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్‌ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సుధామూర్తిని అభినందించిన ప్రధాని మోదీ వివిధ రంగాలకు ఆమె చేసిన కృషి ఎనలేనిదని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
 
సుధా మూర్తి భారతీయ విద్యావేత్త, రచయిత్రి, దాత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్. గేట్స్ ఫౌండేషన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ లో సభ్యురాలు. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 2006 లో సుధా మూర్తికి భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. తరువాత 2023 లో, ఆమెకు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది.
 
 ‘డాలర్ బహు’ నవలను సుధామూర్తి మొదట కన్నడంలో రచించారు. ఆ తర్వాత ఆంగ్లంలోకి కూడా అనువదించారు. ఈ నవల 2001లో జీ టీవీలో ధారావాహికగా ప్రసారం అయింది. ‘రూనా’ అనే ప్రఖ్యాత కథను కూడా ఆమె రాశారు. ఆ కథను మరాఠీలో సినిమాగా కూడా తీశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని సుధామూర్తి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారు అక్షత మరియు రోహన్. అక్షత మూర్తి యూకే ప్రధాని రిషి సునక్ ను వివాహం చేసుకున్నారు.
 
రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి కి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘రాష్ట్రపతి @SmtSudhaMurtyJi ని రాజ్యసభకు నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా వివిధ రంగాలకు సుధామూర్తి గారు చేసిన కృషి ఎనలేనిది, స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ఉనికి మన ‘నారీ శక్తి’కి బలమైన నిదర్శనం, మన దేశ భవితవ్యాన్ని రూపొందించడంలో మహిళల శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. ఆమెకు ఫలవంతమైన పార్లమెంట్ పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.

ఇదో కొత్త బాధ్యతగా భావిస్తున్నా

తనను రాజ్యసభకు నామినేట్‌ చేయడం పట్ల సుధామూర్తి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని, దేశం కోసం పనిచేయడం కొత్త బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఇక, ఇన్పోసిస్ ఎదుగుదలలో సుధామూర్తి శ్రమ ఎంతగానో ఉంది. ఆ సంస్థకు ఛైర్మన్ హోదాలోనూ పనిచేశారు. ప్రస్తుతం 83.92 బిలియన్ డాలర్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ కుమార్తె అక్షతా మూర్తిని మూడు నెలల చంటిబిడ్డను తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు.