బెంగళూరు కేఫ్‌లో పేలుడు నిందితుడి ఫోటో లభ్యం

బెంగళూరు కేఫ్‌లో పేలుడు నిందితుడి ఫోటో లభ్యం
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన నిందితుడికి సంబంధించిన తాజా ఫొటోలు బయటకు వచ్చాయి. అతడు ముఖానికి మాస్క్, తలకు క్యాప్‌ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఫొటోలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. చేతిలో బ్యాగ్‌ పట్టుకొని ముఖానికి మాస్క్‌, తలకు క్యాప్‌ లేకుండా బస్సులో కూర్చున్నట్లు ఫొటోల్లో కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సృష్టికర్తగా అనుమానిస్తున్న నిందితుడికి సంబంధించిన కీలక వివరాలు దర్యాప్తులో లభించినట్లు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర గురువారం వెల్లడించారు. పేలుడు సంఘటన అనంతరం అనుమానితుడు తన దుస్తులు మార్చుకుని బస్సులో ప్రయాణించినట్లు విశ్వసనీయంగా తెలిసిందని ఆయన చెప్పారు.

అనుమానితుడికి సంబంధించిన అనేక ముఖ్యమైన ఆధారాలు లభించినట్లు  ఆయన తెలిపారు. ఈ వివరాలన్నింటినీ ఇప్పుడు వెల్లడించలేమని, అయితే త్వరలోనే అనుమానితుడిని అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. కాగా..తాజాగా లభించిన సిసిటివి పుటేజ్‌లో అనుమానితుడు ముదురు రంగు క్యాప్, వీపున బ్యాగ్, పొడుగు చేతుల చొక్కా, షూస్, ముఖానికి మాస్కు ధరించి బస్సులో ప్రయాణించడం కనిపించింది.

అయితే టీషర్ట్, తలకు క్యాప్, ముఖానికి మాస్కు ధరించి బస్సులో కూర్చుని ప్రయాణిస్తున్న అనుమానితుడి అనధికారిక ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనుమానితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) బుధవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో బుధవారం అతడి ఫోటోను కూడా షేర్ చేసింది.

 సిబిఐ ఈ కేసును చేపట్టినప్పటినప్పటికీ పేలుడు కేసు దర్యాప్తును ప్రాథమికంగా నిర్వహించిన బెంగళూరు పోలీసుకు చెందిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) కేంద్ర దర్యాప్తు సంస్థకు సహాయసహకారాలు అందచేస్తోంది. మార్చి 1న మధ్యాహ్నం లంచ్ అవర్‌లో బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఐఇడి పేలుడులో 10 మంది గాయపడ్డారు.