పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 29న రెండో ఫేజ్ పోలింగ్‌లో అక్కడ అక్రమాలు జరిగాయని నిర్ధారించిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 285 పోలింగ్ బూత్‌లలో మే 21వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలాగే మే 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా ఏప్రిల్ 29న ఫాల్తాలో పోలింగ్ జరిగిన సమయంలో, ‘తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్యలు’ చోటుచేసుకున్న కారణంగా ఈ రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గతనెల 29న జరిగిన రెండో విడతలోనే ఫాల్తా నియోజకవర్గంలోనూ పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ పోలింగ్ ప్రక్రియలో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఈ ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఇదే ఫేజ్‌లో అక్రమాలు జరిగాయన్న కారణంగానే శనివారం అదే జిల్లాలోని మగ్రాహాట్ పశ్చిమ్ (11 బూత్‌లు), డైమండ్ హార్బర్ (4 బూత్‌లు) అసెంబ్లీ స్థానాల్లోని పలు బూత్ల్లో రీ పోలింగ్ జరిగింది. డైమండ్ హార్బర్‌లో పోలింగ్ కేంద్రాల్లో 87.6 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, మగ్రాహట్‌లోని 11 కేంద్రాల్లో 86.11 శాతం పోలింగ్ నమోదైంది.
మరోవంక, ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4న చేపట్టనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో అదనపు పరిశీలకులను నియమించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) శనివారం నాడు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 165 మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లను, 77 మంది పోలీసు అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లు ఉన్న 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయం చేసేందుకు ఈ అదనపు అధికారులను నియమించినట్లు తెలిపింది.
ఇక రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్ల కోసం గుర్తింపు కార్డులను ఇసిఐ వెబ్‌సైట్ లోని ప్రత్యేక మాడ్యూల్ ద్వారా జారీ చేస్తారని సిఇసి పేర్కొంది. రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో ఐడి ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారని, లేకుండా లోపలకు వెళ్లడం కుదరదని పేర్కొంది.

More Stories
అత్యాచార బాధితుల గర్భస్రావం చట్టం సవరించాలి
ఆలయ ప్రవేశాన్ని నాస్తికులు హక్కుగా ఎలా కోరగలరు?
పెద్ద ప్రజారోగ్య సమస్యగా నోటి క్యాన్సర్