నకిలీ సర్టిఫికేట్లతో లాయర్లుగా మారిన 105 మందిపై కేసులు

నకిలీ సర్టిఫికేట్లతో లాయర్లుగా మారిన 105 మందిపై కేసులు
నకిలీ సర్టిఫికెట్లతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దందా సాగిస్తున్న 105 మంది నకిలీ న్యాయవాదుల వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టు సంచలన ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా పని చేస్తున్న న్యాయవాదుల విద్యార్హతలను తనిఖీ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చేపట్టిన సమగ్ర వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
న్యాయ వ్యవస్థ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సాగుతున్న ఈ అక్రమార్కుల ముఠాపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. బాధ్యతాయుతమైన కోర్టు ప్రాంగణాల్లో ఏళ్ల తరబడి చలామణి అవుతున్నఈ కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో దగాకు పాల్పడ్డారు. కేవలం న్యాయ శాస్త్రానికి సంబంధించిన ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పట్టాలను మాత్రమే కాకుండా పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లను కూడా నకిలీవి సృష్టించినట్లు తనిఖీల్లో స్పష్టమైంది.
 
దేశంలోనే పేరుగాంచిన అలహాబాద్ విశ్వవిద్యాలయం పేరుతో ఈ బోగస్ డిగ్రీ పట్టాలు తయారు చేసి ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడి అయింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబీ జిల్లాకు చెందిన అమర్‌సింగ్ అనే వ్యక్తి ఏకంగా 35 సంవత్సరాల పాటు పూర్తిగా నకిలీ ధ్రువపత్రాల ఆధారంగానే న్యాయవాదిగా చలామణి అవ్వడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
కోర్టుల ప్రాంగణంలోనే నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చలామణి కావడంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ అక్రమాలపై ఏమాత్రం ఉపేక్షించవద్దని, బాధ్యులు అందరిపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రయాగ్‌రాజ్ పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ అధికారికంగా సమర్పించిన 105 మంది నకిలీ న్యాయవాదుల వివరాల జాబితాను విశ్లేషించి, కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 39 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పరారీలో ఉన్న, జాబితాలోని మిగిలిన 66 మందిపై కూడా త్వరలోనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.