2030 నాటికి 10 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఎకాన‌మీగా భార‌త్

2030 నాటికి భార‌త్ ఆర్ధిక వ్య‌వ‌స్ధ 10 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ అంచ‌నా వేశారు. ఈ దిశ‌గా పౌరుల జీవ‌న ప్ర‌మాణాల నాణ్య‌త‌ను మెరుగుప‌ర‌చ‌డంపై దృష్టి సారించామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం భార‌త జీడీపీ 3.7 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు కాగా, రాబోయే మూడేండ్ల‌లో మ‌న ఎకాన‌మీ ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌గా ఎదుగుతుంద‌ని అంచ‌నా వేశారు.

ఉక్రెయిన్‌, గాజా వంటి ఘ‌ర్ష‌ణ‌లు ప్ర‌పంచాన్ని కుదిపేసినా భార‌త్ వేగంగా ఎదుగుతున్న‌ద‌ని గోయ‌ల్ వివ‌రించారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యంలో పెద్ద సంఖ్య‌లో పేద‌ల‌కు ఆహార ధాన్యాల పంపిణీతో పాటు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, కుకింగ్ గ్యాస్ స‌ర‌ఫ‌రా స‌హా ఎన్నో ప‌ధ‌కాలు పేద‌ల‌కు ల‌బ్ధి చేకూర్చాయ‌ని పేర్కొన్నారు. విప‌క్షాలు భార‌త వృద్ధి రేటుపై చేస్తున్న ప్ర‌చారం స‌రైంది కాద‌ని తోసిపుచ్చారు.

క్షేత్ర‌స్ధాయిలో ప‌ధ‌కాల అమ‌లును ప‌రిశీలిస్తే ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంద‌ని స్పష్టం చేశారు. భార‌త్ పెద్ద‌మొత్తంలో విదేశీ పెట్టుబ‌డుల ప్ర‌వాహాన్ని ఆక‌ర్షిస్తూ ప‌లు దేశాల‌కు విశ్వ‌స‌నీయ భాగ‌స్వామిగా మారింద‌ని చెప్పారు. రాబోయే ద‌శాబ్ధంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో టెక్నాల‌జీలు, పెట్టుబ‌డులు దేశంలోకి వ‌స్తాయ‌ని వీటి ద్వారా దేశ యువత‌కు ఉపాధి అవ‌కాశ‌లు పెర‌గ‌డంతో పాటు మ‌న ఆర్ధిక కార్య‌క‌లాపాలు విస్తృతం అవుతాయ‌ని వివరించారు.