వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.100 త‌గ్గింపు

ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఎల్పీజీ సిలిండ‌ర్ గ్యాస్‌పై రూ.100 త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ ట్వీట్ చేశారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ల‌క్ష‌లాది ఇండ్ల‌పై ఆర్థిక భారం త‌గ్గుతుంద‌ని, ముఖ్యంగా లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
ముఖ్యంగా నారీ శ‌క్తికి చాలా ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని ప్రధాని చెప్పారు. వంట గ్యాస్ ధ‌ర‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల‌, కుటుంబాల‌కు ఆర్థిక స‌హ‌కారం అందుతుంద‌ని, ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. 
 ఆ కోణంలోనే ఈ చ‌ర్య చేప‌ట్టామ‌ని, మ‌హిళల జీవితాలు స‌ర‌ళం త‌రం చేసేందుకు ఈ ప్ర‌క్రియ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.
 ‘‘ఇవాళ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.100 తగ్గిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని మోదీ ట్వీట్‌లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 955గా ఉంది. రూ.100 తగ్గడంతో రూ.855కి చేరుతుంది.

మరోవంక, ఎల్పీజీ సిలిండర్‌పై ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగిస్తున్నట్టు గురువారం కేంద్రం తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన  పథకం కింద 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 7, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

పీఎంయూవై లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఏడాదికి 12 రీఫిల్స్‌కు అందించడం జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మార్చి 1, 2024 నాటికి 10.27 కోట్లకు పైగా ఈ పధకం లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీ మొత్తాన్ని రూ. 200 నుంచి రూ. 300 పెంచింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ కొనసాగింపు కారణంగా కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 12,000 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు.