ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణల ఎన్నికను గవర్నర్‌ పునర్‌పరిశీలించాలని ఆదేశించింది. 
 
మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌ లేదని పేర్కొంది. కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్ప తిరస్కరించకూడదని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. వీరి పేర్లను గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది. 

తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత జనవరిలో కోదండరాం, అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడంతో గవర్నర్ అమోదించారు.

కోర్టు వివాదం పెండింగ్‌లో ఉండగా నియామకాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. రెండు వేర్వేరు పిటిషన్లపై గురువారం తీర్పు వెలువడింది. ఎమ్మెల్సీల నియామకాలను రద్దు చేయడానికి గవర్నర్‌‌కు అధికారం లేదని, పేర్లను క్యాబినెట్‌కు తిప్పి పంపాలని స్పష్టం చేసింది.

ఈ ఏడాది జనవరి 30వ తేదీన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి క్యాబినెట్‌ మళ్లీ కొత్తగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల నియామకంపై అభ్యంతరాలు ఉంటే క్యాబినెట్‌కు తిప్పి పంపాలని, తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.