అతి తక్కువ ధరకే 9 రోజుల అయోధ్య టూర్ ప్యాకేజీ

  • తిరుపతి నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు

వేసవిలో అయోధ్య పర్యటనకు అతి తక్కువ ధరలో ఒక ప్యాకేజీని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ 9 పగలు, 8 రాత్రులు ఉంటుంది. ఈ ప్యాకేజీలోనే  పూరి, గయా, వారణాసి, అయోధ్య,  ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించే అవకాశం లభిస్తుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.15,100 మాత్రమే.

ఈ ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఈ ప్యాకేజీలోనే ఆహారం ఇస్తారు. మార్చి 23 నుంచి యాత్ర ప్రారంభం కానుంది, దీని కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఐఆర్ సీటీసీ వెబ్‌సైట్ irctctourism.com వెబ్ సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు.

ఈ ప్యాకేజీ పేరు పుణ్య క్షేత్ర యాత్ర.. పూరి-కాశీ-అయోధ్య (SCZBG20). బోర్డింగ్/డీబోర్డింగ్ స్టేషన్: సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం.

ఈ ప్యాకేజీలో భాగంగా పూరిలో జగన్నాథ స్వామి ఆలయం; కోణార్క్ సూర్య దేవాలయం; గయలో విష్ణుపద దేవాలయం; వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం,  కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి; అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌గర్హి, సరయూ నది వద్ద ఆరతి; ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమం సందర్శించవచ్చు.

బడ్జెట్ ప్రకారం రైలులోని స్లీపర్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలను ఎంచుకోవచ్చు. దీని ప్రకారం,ఎకానమీ క్లాస్ (స్లీపర్)లో ప్రయాణిస్తే రూ.15,100 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ క్లాస్ (థర్డ్ ఏసీ) ప్యాకేజీ తీసుకుంటే ఒక్కో వ్యక్తికి రూ.24,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ) కోసం ఒక్కొక్కరికి రూ. 31,400 వెచ్చించాల్సి ఉంటుంది.

ఇలా ఉండగా, దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్యకు కొత్త రైలును ప్రారంభించింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుపతి నుంచి ధర్మానికి నిలువెత్తు మానవ రూపమైన శ్రీరాముడు కొలువైన అయోధ్యకు ఆస్తా స్పెషల్ పేరుతో దీన్ని నడుపుతున్నారు. 

 ఈ రైలును అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. రూ.2,440 ప్యాకేజీతో రవాణా, వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. దాదాపు 500 మంది భక్తులు ఈ రైలులో అయోధ్యకు బయలుదేరారు.  తిరుపతి పక్కనే ఉన్న నెల్లూరు, చిత్తూరు అన్నమయ్య జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఆయా జిల్లాల ప్రజలు అయోధ్యలో కొలువైన రామ్ లల్లాను దర్శించుకోవడానికి రైల్వే కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.