శివరాత్రి రోజు సెలవు దినాలు రద్దు చేయడం దుర్మార్గం

హిందువులు అత్యంత పరమ పవిత్రంగా ఆరాధించే శివరాత్రి రోజు తెలంగాణ ప్రభుత్వం సెలవు దినాలను రద్దు చేస్తూ  జీవో జారి చేయడం దుర్మార్గమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మండిపడింది. కైలాస నాథుడు శివుడి కి అత్యంత ప్రీతిపాత్ర మైనటువంటి రోజు శివరాత్రి. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా శివరాత్రి రోజు ఉపవాస దీక్షలు చేపట్టడం.., రాత్రంతా కంటిమీద రెప్పవాల్చకుండా జాగరణ చేయడం, మరుసటి రోజు శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాక ఉపవాస దీక్షలు విరమించడం హిందూ సంప్రదాయం అని గుర్తు చేసింది. 

శివరాత్రి పర్వదినం, మరుసటి రోజు కూడా యధావిధిగా గత ప్రభుత్వాలు  సెలవు దినాలు కొనసాగించాయి. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్నందున హిందువులపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా సెలవు దినాలలో కూడా విధులు నిర్వహించాలని ప్రభుత్వం జీవో జారీ చేయడం అత్యంత దుర్మార్గమని  పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బి. నరసింహమూర్తి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు ధ్వజమెత్తారు. 

ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకొని, శివరాత్రి పర్వదినం సందర్భంగా యధావిధిగా ప్రకటించిన సెలవు దినాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. హిందువులకేమో ఉన్న సెలవు దినాలను కూడా రద్దు చేస్తూ విధులకు హాజరుకావాలని జీవోలు జారీ చేయడం, మరోవైపు రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రత్యేక సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనం కాదా? అని వారు ప్రశ్నించారు. 

రాజ్యాంగ విరుద్ధంగా హిందువులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పరిషత్ నేతలు హెచ్చరించారు.  మార్చి 7, 8, 9 తేదీలలో పంచాయతీరాజ్ విభాగం అధికారులు శివరాత్రి సెలవు దినాలను రద్దుచేసి విధులకు హాజరు కావాలని విడుదల చేసిన జీఓ ను వెంటనే నిలిపివేసి, యధావిధిగా సెలవులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.