బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి

* ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్
 

సందేశ్ ఖాళి హింసాత్మక ఘటనలతో పశ్చిమ బెంగాల్ రగిలిపోతుంది. అల్లర్లకు కారణమైన టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి మారలేదు. పోలీసుల వద్ద షాజహాన్ స్వేచ్ఛగా ఉన్నారని విపక్షాలు మండి పడుతున్నాయి. సందేశ్ ఖాళి అల్లర్ల కేసును బెంగాల్ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. కేసును సీఐడీ నుంచి సీబీఐ అధికారులకు అప్పగించాలని కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్‌లో రాష్ట్రపతిప పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ ఇలాంటి ప్రతిపాదన చేశారు. 

ఆ తర్వాత రేఖా శర్మ కూడా రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ‘సందేశ్ ఖాళి ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటింది. సందేశ్ ఖాళి ఘటనే కాదు ఇదివరకు చాలా ఘటనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేశాను అని’ రేఖా శర్మ తెలిపారు. 

బెంగాల్‌లో పరిస్థితిని నిశీతంగా పరిశీలిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము తమకు తెలియజేశారని రేఖా శర్మ వివరించారు. భూ ఆక్రమణలు, మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలను టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రేషన్ స్కామ్‌కు సంబంధించి షాజహాన్ ఇంటికి ఈడీ అధికారులు రాగా అతని అనుచరులు దాడి చేశారు. దాంతో వివాదం చెలరేగింది.

టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్, అతని సహచరులు మహిళలపై లైంగిక హింస, బెదిరింపుల ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకొనేందుకు  సమస్యాత్మక సందేశ్‌ఖాలీ గ్రామాన్ని ఎన్సిడబ్ల్యు బృందం సందర్శించిన తరువాత కమిషన్‌ రూపొందించిన నిజ నిర్ధారణ నివేదికను రేఖ శర్మ రాష్ట్రపతికి సమర్పించారు. పోలీసు సిబ్బంది, అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, క్రమబద్ధమైన  అధికార దుర్వినియోగంపై పాల్పడుతున్నారని ఆమె నివేదికలో వెల్లడించారు. మహిళల నుండి సేకరించిన ఆందోళన కలిగించే సాక్ష్యాలను కూడా నివేదికలో పొందుపరిచారు.