మహిళల రక్షణను గాలికొదిలేసిన దీదీ ప్రభుత్వం

* మోదీని కలిసిన సందేశ్‌ఖాలి బాధిత మహిళలు

తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోదీ  తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని మోదీ  పశ్చిమ బెంగాల్‌ వచ్చారు. సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గంలో గల బరాసత్‌లో జరిగిన బహిరంగ సభకు భారీగా మహిళలు వచ్చారు. 

వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ టీఎంసీ ప్రభుత్వంలో ఎన్నడూ మహిళలకు భద్రత లేదని విమర్శించారు.  టీఎంసీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ నేల మ‌హిళ‌లు వేధింపుల‌కు గురైన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో జ‌రిగిన ఘ‌ట‌న సిగ్గుచేటు అని,   స్థానిక టీఎంసీ స‌ర్కారు మీ బాధ‌ల‌ను పట్టించుకోవ‌డం లేద‌ని ధ్వజమెత్తారు.

సందేశ్‌ఖాలీలో మహిళలపై ఏమైనా జరిగినా అది సిగ్గుచేటని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “టిఎంసి నాయకులు పేద, దళిత, గిరిజన కుటుంబాల సోదరీమణులు, కుమార్తెలపై వివిధ ప్రదేశాల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బెంగాల్ లోనే కాకుండా దేశం అంతటా మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ సందేశ్‌ఖాలీ తుఫాను పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి ప్రాంతానికి చేరుకుంటుంది.   రాష్ట్రవ్యాప్తంగా టిఎంసిని నాశనం చేస్తుంది” అని ప్రధాని హెచ్చరించారు. 

సందేశ్‌ఖాలీలో అకృత్యాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని టీఎంసీ ర‌క్షిస్తోంద‌ని ప్రధాని విమ‌ర్శించారు. ఈ కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు ప‌డ్డాయ‌ని గుర్తు చేశారు. టీఎంసీ నేత‌లు మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌ధాని మోదీ ఆరోపించారు. టీఎంసీకి త‌మ నేత‌ల ప‌ట్ల పూర్తి విశ్వాసం ఉంద‌ని, కానీ బెంగాల్ మ‌హిళ‌ల ప‌ట్ల లేద‌ని ఆయ‌న మండిపడ్డారు. 

సందేశ్‌ఖాలీలో జ‌రిగిన ఘ‌ట‌న యావ‌త్ రాష్ట్రాన్ని కుదిపేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ‘టీఎంసీ ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు రక్షణ కల్పించదు. లైంగిక దాడి, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిపై బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. జీవిత ఖైదు విధించాలని నిర్ణయం తీసుకుంది’ అని ప్రధాని తెలిపారు. `మహిళల ఫిర్యాదులను సులభంగా నమోదు చేసేందుకు మహిళా సహాయాన్ని ఏర్పాటు చేశాం. టీఎంసీ ప్రభుత్వం అలా చేయలేదు. మహిళల సంక్షేమం కోసం టీఎంసీ ప్రభుత్వం ఎన్నటికీ పనిచేయలేదు అని’ ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

‘నారీ శక్తిని వికసిత్ భారత్ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎలా మారుస్తుందో చెప్పడానికి బరాసత్‌లో జరిగిన కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది. జనవరి 9వ తేదీన దేశవ్యాప్తంగా బీజేపీ శక్తివందన్ కార్యక్రమం చేపట్టింది. లక్షలాది స్వయం సహాయక సంఘాలతో చర్చలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం భారీ కార్యక్రమం నిర్వహించాం’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. 

`కోల్ కతాలో వివిధ అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశా. కోల్ కతా మెట్రో, పుణె మెట్రో, కొచ్చి మెట్రో, ఆగ్రా మెట్రో నమో భారత్ రైళ్లకు అనుసంధానించబడ్డ కొత్త మార్గాలు విస్తరించాయి. 2014కి ముందు కోల్ కతా మెట్రో 28 కిలోమటర్లు మాత్ర ఉండేది. గత పదేళ్లలో మరో 31 కిలోమీటర్ల మార్గం అనుసంధానించాం. దేశ ప్రజా రవాణాను ఆధునీకరించాం అని’ ప్రధాని మోదీ వెల్లడించారు.

కాగా, భూఆక్రమణలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో అట్టుడికిన పశ్చిమబెంగాల్‌లోని సందేశ్ ఖాలికి చెందిన బాధిత మహిళలు పలువురు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారంనాడు కలుసుకున్నారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాని ఎంతో ఓపికగా వినబడంతో పాటు ఆయన కూడా కలత చెందారు. దీంతో బాధిత మహిళలు మరింత భావోద్వేగానికి గురయ్యారు.

మ‌రో వైపు మోదీ స‌భ కోసం సందేశ్‌ఖాలీ మ‌హిళ‌ల‌తో వెళ్తున్న బ‌స్సుల‌ను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. సెక్యూర్టీ ప్రోటోకాల్ వ‌ల్ల వాహ‌నాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. బిశ్వ బంగ్లా గేటు వ‌ద్ద తొలుత బ‌స్సుల‌ను ఆపేశార‌ని, ఆ త‌ర్వాత ఎయిర్‌పోర్టు గేట్ 1 వ‌ద్ద ఆపార‌ని ఆ రాష్ట్ర బీజేపీ నేత‌లు ఆరోపించారు. ప్ర‌ధాని మోదీ ర్యాలీకి వెళ్ల‌కుండా త‌మ‌ను అడ్డుకున్న‌ట్లు పేర్కొన్నారు.