నలుగురి పేర్లతో బిఆర్ఎస్ తొలి జాబితా

త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.  వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు మరోసారి అవకాశం కల్పించారు. ఇప్ప‌టికే ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాలకు ఎంపిగా ఉన్న ఆ ఇద్ద‌రు తిరిగి అదే స్థానాల నుంచి రంగంలోకి దిగ‌నున్నారు..
 
సోమవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ముఖ్యనేతల భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్‌ స్వయంగా ఈ పేర్లను ప్రకటించారు.
 
 ”వచ్చే ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. ప్రభుత్వానికి ప్రతిపక్షం రుచి చూపిస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. కేడర్ కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పని చేయాలి”  అంటూ దిశానిర్ధేశం చేశారు. అదేవిధంగా,  కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌ పేర్లను ప్రకటించారు. 
 
ఆది, సోమవారాల్లో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలపై నేతలతో చర్చించి, అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతల అభిప్రాయం మేరకు సమష్టి నిర్ణయంతో తొలి విడుదతలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలువబోతున్న అభ్యర్థులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.