బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే

* తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న మోదీ

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీస్పష్టం చేశారు. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సోమవారం ఆదిలాబాద్‌లో టీ-బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా   కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దని సూచించారు. కుటుంబ పార్టీల్లో ఉండేది రెండేనని.. ఒకటి దోచుకోవడం, రెండు అబద్ధాలు అని ఎద్దేవా చేశారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నా కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోందని ప్రధాని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు తిన్నారు అంటే మీరు తిన్నారు అనుకుంటున్నారు అని సెటైర్ వేశారు. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి అవుతోందని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందుని తెలిపారు. ఆదివాసీల ప్రగతి కోసం బీజేపీ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు.
 
దేశ అభివృద్ధి కోసం వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇది ఎన్నికల సభ కాదని, ఎన్నికలు తేదీలు ఇంకా ప్రకటించనే లేదని పేర్కొంటూ దేశంలో ఈ రోజు వికాస ఉత్సహం జరుగుతోందని,15 రోజుల్లోనే రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎస్‌, పలు రైల్వే, రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. 
 
ఆత్మనిర్భర్ భారత్ నుండి వికసిత్ భారత్ వైపు అడుగులు వేశామని చెబుతూ మీరందరూ వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ప్రధాని  స్పష్టం చేశారు. ఆదివారం కేంద్ర మంత్రులు, అధికారులతో కేబినెట్ భేటీ నిర్వహించానని.. ఈ భేటీలో ఎన్నికల గురించి కాకుండా వికసిత్ భారత్‌పైనే చర్చించామని తెలిపారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. మళ్లీ బీజేపీకి ఓటేయాలని ఈ సందర్భంగా మోదీ  విజ్ఞప్తి చేశారు.

దేశంలో పదేళ్ల బీజేపీ పాలన రాష్ట్రాల్లో అభివృద్ధికి కొత్త నిర్వచనం చెబుతుందని ప్రధాని మోదీ అంతకు ముందు చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ ఎన్టీపీసీ  నిర్మించిన 80మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. తెలంగాణ సాధించిన ప్రగతిని దేశం మొత్తం గమనిస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించినట్టు ప్రధాని మోదీ చెప్పారు. 
 
ఎన్టీపీసీ రెండో యూనిట్‌లో తక్కువ కార్బన్‌ ఉద్గారాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. రైల్వే లైన్‌ విద్యుదీకరణ పనులు, ఆదిలాబాద్‌-దేలా జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ ను రైలు, రోడ్డు మార్గాలను ఆధునీకరించడం ద్వారా తెలంగాణలో అభివృద్ధి సాధించ గలుగుతున్నామని చెప్పారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో అభివృద్ధి ద్వారా దేశ వికాసానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ సాధిస్తున్న పురోగతిపై చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత మార్కెట్లు అవతరించ గలిగాయని పేర్కొంటూ పదేళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపంచినట్టు తెలిపారు.

తెలంగాణ రావడానికి పదేళ్ల ముందు తెలంగాణలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి తాము అందించిన సహకారానికి నిదర్శనం అని ప్రధాని తెలిపారు. రానున్న ఐదేళ్లలో మరింత పురోభివృద్ధి జరుగుతుందని, తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకు వెళతామని హామీ ఇచ్చారు.