ముడుపుల కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌లేం

* సుప్రీం తీర్పును ప్రశంసించిన ప్రధాని మోదీ

ఒక‌వేళ లంచం తీసుకున్న‌ట్లు ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే, అప్పుడు వాళ్ల‌ను విచారించ‌వ‌చ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టిక‌ల్ 105, 194ను సాకుగా చూపి వాళ్లు విచార‌ణ నుంచి త‌ప్పించుకోవ‌డం కుద‌ర‌ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. 
 
ఆ బెంచ్‌లో జ‌స్టిస్ ఏఎస్ బొప్ప‌న్న‌, ఎంఎం సుంద్రేశ్‌, పీఎస్ న‌ర‌సింహ‌, జేబీ ప‌ర్దివాలా, పీవీ సంజ‌య్ కుమార్, మ‌నోజ్ మిశ్రా ఉన్నారు. అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్​లోని ఎంపీలకు.. అవినీతి, లంచం కేసుల్లో విచారణ నుంచి మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు.. 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది!
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇదో గొప్ప తీర్పు అంటూ ప్రశంసించారు. సుప్రీం తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని కూడా జత చేశారు.

ప్రసంగాలు, అసెంబ్లీ, పార్లమెంట్​లో ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ్యులకు విచారణ నుంచి మినహాయింపును ఇస్తూ 1998లో తీర్పును వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 105(2), 194(2 ) పార్లమెంటరీ ప్రివిలేజ్​ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇస్తున్నట్టు నాటి ధర్మాసనం పేర్కొంది. 

అయితే ఆ తీర్పు అర్థం, లంచం తీసుకోవడం అనేది ఆర్టికల్​ 105, 194 లకు విరుద్ధంగా ఉన్నాయని తాజాగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు.. నాటి తీర్పును కొట్టివేసింది.. సీజీఐ జస్టిస్​ చంద్రచూడ్​ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం.

“శాసన సభలు, పార్లమెంట్ లో   ప్రసంగాలు, ఓటు కోసం అవితీనికి పాల్పడ్డారని, లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు. ప్రివిలేజ్​ (అధికారాలు)ని తీసుకురావడానికి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. హౌజ్​ మొత్తానికి సంబంధించిన అధికారాలు అవి. ప్రివిలేజ్​ పేరుతో చట్టసభ్యులు అవినీతికి పాల్పడి లంచాలు తీసుకుంటే.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనే మచ్చపడుతుంది. ఈ విషయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు కచ్చితంగా అర్థం చేసుకోవాలి,” అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాజ్యాంగం పరంగా ముడుపులు తీసుకోవడం అనేదే అతి పెద్ద నేరం అని, చట్టసభ్యులు అవితీనికి పాల్పడటం అనేది ప్రజా జీవితంలో వారి నైతిక విలువలకు సంబంధించినది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టసభ్యుడు అవినీతికి పాల్పడితే నేరం చేసినట్టే అని పేర్కొంది.

గ‌తంలో పీవీ న‌ర్సింహారావు కేసులో జ‌రిగిన విచార‌ణ‌ను విశ్లేషించామ‌ని, ఆ తీర్పుతో తాము ఏకీభ‌వించ‌డం లేద‌ని, ఆ తీర్పును కొట్టివేస్తున్నామ‌ని, ఎంపీల‌కు విచార‌ణ విష‌యంలో ఇమ్యూనిటీ ఇవ్వ‌డం లేద‌ని, న‌ర్సింహారావు కేసులో ఇచ్చిన తీర్పు వ‌ల్ల ప్ర‌మాదం ఉంద‌ని ఇవాళ సుప్రీం బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.

ఆర్టిక‌ల్స్ 105(2), 194(2) ప్ర‌కారం ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తే , అప్పుడు అది యావ‌త్ స‌భా వ్య‌వ‌హారాల‌కు సంబంధం ఉన్న‌ట్లు అవుతుంద‌ని కోర్టు తెలిపింది. పార్ల‌మెంట‌రీ హ‌క్కుల ద్వారా అవినీతిప‌రుల్ని ర‌క్షించ‌డం స‌రైన విధానం కాదు అని కోర్టు చెప్పింది. లంచం దేని గురించి ఇచ్చార‌న్న‌ది కాదు, లంచం ఇవ్వ‌డం, తీసుకోవ‌డం నేర‌మ‌ని కోర్టు తెలిపింది.

ఝార్ఖండ్​ ముక్తి మోర్చా నేత సీతా సోరెన్​.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటువేసేందుకు లంచం తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. 2012లో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఆర్టికల్​ 15 కింద తనకు మినహాయింపు లభిస్తుందని సీతా సొరేన్​ పేర్కొన్నారు. ఝార్ఖండ్​ కోర్టు మాత్రం.. సీతా సొరేన్​ అపీలును కొట్టిపారేసింది. అనంతరం.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ కేసు ముందుకు కదల్లేదు.

కాగా.. ఈ కేసుపై.. 2023 అక్టోబర్​లో రెండు రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. తీర్పు ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని అందరు ఎదురుచూశారు. చివరికి.. సోమవారం.. తీర్పును వెలువరించింది సుప్రీం ధర్మాసనం. ధర్మాసనంలోని ఏడుగురు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు ఇది. లంచం అనేది పార్లమెంటరీ ప్రివిలేజ్​లలో భాగం కాదని వారు తేల్చిచెప్పారు.

వాస్తవానికి ఈ వ్యవహారంపై 1998లో ఇచ్చిన తీర్పులో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లంచం తీసుకుని ఓటు వేసిన చట్టసభ్యులకు.. తీర్పు ద్వారా ప్రొటెక్షన్​ లభిస్తోంది. కానీ.. లంచం తీసుకున్నప్పటికీ.. తనకు నచ్చినట్టు ఓటు వేస్తున్న వారిపై మాత్రం విచారణలు జరుగుతున్నాయి!