కాంగ్రెస్‌ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది

కాంగ్రెస్‌ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.  బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లమధ్య స్కాముల బంధం గట్టిదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పటాన్ చెరులో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని తాను వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కుటుంబపార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు.
 
యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని, అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ తనపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖాజానాను నింపుకుంటున్నారని విమర్శించారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నామని చెబుతూ ప్రజల నమ్మకాన్ని తానెప్పుడూ వమ్ము కానివ్వనని   ప్రధాని హామీ ఇచ్చారు.
 
‘తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు. అయితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఒకటే. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది. కాళేశ్వరంలో బీఆర్‌ఎస్‌ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్‌ దోచుకుంది. కాంగ్రెస్‌ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది. కాంగ్రెస్‌ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు’ అని ప్రధాని తేల్చి చెప్పారు.
 
కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నానంటూ జమ్మూకాశ్మీర్‌ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయని, . వాళ్లకు కుటుంబం ఫస్ట్‌ అయితే తనకు నాకు దేశం ఫస్ట్‌ అని ప్రధాని తెలిపారు. దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే అని స్పష్టం చేశారు. 
 
`తెలంగాణ ప్రజల కలలు.. నా సంకల్పం. ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు. నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం.’ అని మోదీ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని చెబుతూ తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోందని, బీజేపీని బాగా ఆదిరిస్తున్నారన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చుతామని ప్రకటించారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు. 
 
ప్రపంచదేశాల్లో తెలుగు ప్రజలు ముఖ్య భూమిక పోషిస్తున్నారని చెబుతూ విదేశాల్లో చాలామంది తెలుగువారు ఉన్నారన్నారని ప్రధాని తెలిపారు. విదేశాల్లో మనవాళ్లను చూస్తుంటే గర్వంగా ఉందని అంటూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, కమలం పార్టీ 400 సీట్లు సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

కుటుంబ పార్టీలు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా?

కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా? అని ప్రధాని నరేంద్ర మోదీ  ప్రశ్నించారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు. కుటుంబ రాజకీయాలతో యువతకు అవకాశాలు దొరకడంలేదని విమర్శలు గుప్పించారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. నిన్న ఆదిలాబాద్ నుంచి రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఇవాళ సంగారెడ్డి నుంచి రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధిగా తాను నమ్ముతున్నానని తెలిపారు. 

 బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేందం ఇది అని, దీని ద్వారా హైదరాబాద్, తెలంగాణకు మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. ఏవియేషన్ కేంద్రం, స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా హైదరాబాద్ నిలుస్తుందని ప్రశంసించారు.