తెలంగాణాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

లోక్ సభ ఎన్నికలకు బీజేపీ 195 మందితో ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుండి తిరిగి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మల్కాజ్ గిరి నుండి పోటీచేయనున్నారు. తెలంగాణాలో మొదటగా అభ్యర్థులను ప్రకటించిన పార్టీ బిజెపి కావడం గమనార్హం. పైగా, సగంకు పైగా అభ్యర్థులను ప్రకటించింది.
 
తాజాగా బీజేపీలో చేరిన బిఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు సీట్లు దక్కించుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిన వెంటనే టికెట్ దక్కించుకోగా,  నాగర్‌కర్నూల్ సీటును ఎంపీ రాములు తన కుమారుడు భరత్ కు ఇప్పించుకున్నారు. ఇక హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై మాధవీ లత పోటీ చేయనున్నారు. బిఆర్ఎస్ మాజీ ఎంపీలు కొండా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ మరోమారు వరుసగా చేవెళ్ల, భువనగిరిల నుండి ఈ సారి బిజెపి అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.
 
బీజేపీ తొలి జాబితాలో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. మరో 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. సిట్టింగ్‌ ఎంపీలలో ముగ్గురికి టికెట్లు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేరును అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. మిగతా సీట్లకు సైతం పోటీ భారీగా ఉండడంతో మిగతా సీట్లు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అభ్యర్థులు
  • కరీంనగర్ – బండి సంజయ్
  • నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
  • జహీరాబాద్ -బీబీ పాటిల్
  • మల్కాజ్ గిరి – ఈటల రాజేందర్
  • సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
  • హైదరాబాద్ -డా. మాధవీ లత
  • చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • నాగర్ కర్నూల్ – పి.భరత్
  • భువనగిరి -బూర నర్సయ్య గౌడ్