ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో తెలంగాణ

వ్యవసాయ రంగంలో రైతులకు దన్నుగా నిలుస్తూ ఈ రంగాన్ని బలోపేతం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్ తెలిపారు. సాగురంగంలో ప్రతికూలతలను తట్టకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరిందని ఆయన వెల్లడించారు. 

సచివాలయంలో శుక్రవారం సిఎం రేవంత్‌రెడ్డితో వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫసల్‌బీమా పథకం సీఈవో కేంద్ర కార్యదర్శి రితేష్ చౌహన్ సమావేశమయ్యారు. ఫసల్‌బీమా పధకంపై చర్చించారు. వచ్చే పంటకాలం నుంచి ఈ పధకం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.

రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం కేంద్ర ప్రభుత్వ పథకాలకు, విధానాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్దికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సిఎం కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ఉన్న విష‌యం, ఆ త‌ర్వాత నాటి ప్ర‌భుత్వం దాని నుంచి ఉప సంహ‌రించుకున్న తీరుపై చ‌ర్చ జ‌రిగింది. పీఎంఎఫ్‌బీవైలోకి రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగిచేర‌డంతో వ‌చ్చే పంట కాలం నుంచి రైతులు ఈ ప‌థ‌కం నుంచి పంట‌ల బీమా పొంద‌నున్నామని తెలిపారు.
 
 పీఎంఎఫ్ బీవైతో రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని, పంట‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని రితేష్ చౌహాన్ తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని తెలిపారు. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నామని వెల్లడించారు.

అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.