రాజ్యసభలో ఖాళీ కానున్న 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా అందులో 41 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ 15 స్థానాలకు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ సందర్భంగానే ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు క్రాస్ ఓటింగ్ ప్రభావం చాపింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయగా, కర్ణాటకలో మాత్రం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ 10 స్థానాలకు బీజేపీ 8 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని బరిలో ఉంచింది. అయితే యూపీలో ఏడుగురు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి తన బలంకన్నా ఒక సీటు ఎక్కువగా 8 సీట్లు గెల్చుకోగా,ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ టీ రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగడం పెను సంచలనంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతుగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పోటీలో ఉన్న అభిషేక్ మను సింఘ్వీకి నిరాశ తప్పలేదు.
ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయడం సంచలంగా మారింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ- జేడీఎస్ కూటమికి గట్టి షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటేసినట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోవడం కూడా బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది. దీంతో కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకోగా, బిజెపి ఓ సీట్ గెల్చుకుంది.
కర్ణాటక బీజేపీపై గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో ఎస్‌టీ సోమశేఖర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశంపై స్పీకర్‌తో మాట్లాడతామని విపక్ష నేత, కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్ అశోకా తెలిపారు. ఓటింగ్ అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఎస్‌టీ సోమశేఖర్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో తన మనస్సాక్షికి అనుగుణంగానే ఓటు వేశానని చెప్పడం మరిన్ని ఊహాగానాలకు దారి తీస్తోంది.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు