లోక్‌పాల్‌ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ అజయ్ మాణిక్‌రావు

కేంద్రంలో నిర్దిష్ట స్థాయి ప్రజా సేవకులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావు ఖన్విల్కర్‌ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని లోక్‌పాల్‌ ఎంపిక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకం చేపట్టారు.

లోక్‌పాల్‌ చైర్మన్‌తోపాటు మరో ఆరుగురిని సభ్యులుగా కూడా నియమితులయ్యారు. వారిలో హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లింగప్ప నారాయణస్వామి, అలహాబాద్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ యాదవ్‌, భారత లా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రితురాజ్‌ అవస్తిని జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమించారు.

మరో ముగ్గురు మాజీ సివిల్‌ సర్వెంట్‌లను నాన్‌ జ్యుడీషియరీ సభ్యులుగా రాష్ట్రపతి నియామకం చేశారు. వారిలో భారత మాజీ ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌ చంద్ర కుమార్‌, పంకజ్‌ కుమార్‌, అజయ్‌ టిర్కీ ఉన్నారు. కేంద్ర సర్కారులోని ప్రధాని, క్యాబినెట్‌ మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, గ్రూప్‌-ఎ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఈ లోక్‌పాల్‌ విచారణ చేస్తుంది.

దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉధృతమవటంతో 2013లో లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే లోక్‌పాల్ చట్టం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారు. దాంతో కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల నియామకానికి సంబంధించిన లోక్‌పాల్ బిల్లు 2013లో పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొందింది. 2014 జనవరి 16న లోక్‌పాల్ చట్టం రూపుదిద్దుకుంది. చట్టం చేసినప్పటికీ ఆ తర్వాత దాదాపు ఐదేళ్లకు 2019 మార్చిలో తొలి లోక్‌పాల్‌ నియామకం జరిగింది.

జస్టిస్ ఖన్విల్కర్ 2016 మే 13 నుంచి 2022 జూలై 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. శబరిమల మహిళల ప్రవేశం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం, ఆధార్ చెల్లుబాటు వంటి కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. 

కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018)లో ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా మరణించే హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ ఖన్విల్కర్ కూడా ఉన్నారు. జస్టిస్ ఖన్విల్కర్ సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడానికి ముందు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

ప్రధానమంత్రి చైర్ పర్సన్ గా ఉన్న సెలెక్ట్ కమిటీ చేసిన సిఫారసులను స్వీకరించిన తర్వాత లోక్ పాల్ చైర్ పర్సన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. లోక్ పాల్ లో సాధారణంగా చైర్ పర్సన్ తో పాటు నలుగురు జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ కలిపి మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం 2022 మే 27న పూర్తయిన తర్వాత లోక్ పాల్ రెగ్యులర్ చీఫ్ లేకుండానే పనిచేస్తోంది.