సోమవారం నాటికి గాజాపై కాల్పుల విరమణ!

* 40 రోజుల కాల్పుల  విరమణకు ఇజ్రాయిల్ సిద్ధం

వచ్చే సోమవారం నాటికి గాజాపై కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వెల్లడించారు. న్యూయార్క్‌ పర్యటన సందర్భంగా బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ చర్చలు కొనసాగుతున్నాయని తమ జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారని, అయితే ఇంకా పూర్తికాలేదని చెప్పారు. 

పాలస్తీనా భూభాగంపై కొనసాగుతున్న మానవ సంక్షోభం మధ్య, ఇజ్రాయిల్‌ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఈజిప్ట్‌, ఖతార్‌, అమెరికా, ఫ్రాన్స్‌ ఇతర ప్రాంతాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. గాజాపై దాడిని నిలిపివేయాలని, ఇజ్రాయిల్‌ బందీలను విడుదల చేయాలని కోరుతున్నారు.

గాజాలో తీవ్రవాదులు తమ వద్ద ఉన్న బందీలలో కొందరి విడుదలకు ఒక ఒప్పందం కుదిరిన పక్షంలో రానున్న రమాదాన్ ఉపవాస మాసంలో అక్కడ హమాస్‌పై యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ సుముఖంగా ఉంటుందని జో బైడెన్ ప్రకటించారు. ‘రమాదాన్ సమీపిస్తోంది. రమాదాన్ సమయంలో పోరుకు దిగరాదని ఇజ్రాయెల్ అంగీకరించింది. బందీలు అందరి విడుదలకు మాకూ వ్యవధి లభించగలదు’ అని బైడెన్ ఎన్‌బిసి కార్యక్రమం ‘నైట్ విత్ సేథ్ మెయర్స్’లో చెప్పారు. అదే సమయంలో యుద్ధాన్ని ముగించాలని బైడెన్ పిలుపు ఇవ్వకపోవడం గమనార్హం.

రంజాన్‌ నెలలో కాల్పుల విరమణకు ఈజిప్టు, ఖతార్‌ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో  ఇజ్రాయెల్‌ ఓ అడుగు ముందుకు వేసింది. 40 రోజుల పాటు అన్నిరకాల సైనిక కార్యకలాపాలకు విరామమివ్వాలనే పారిస్‌ చర్చల ప్రతిపాదనలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ అధికారి ఒకరిని ఉటంకిస్తూ రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు.. 1:10 నిష్పత్తిలో హమాస్‌ చెరలో ఉన్న బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడికి ఇజ్రాయెల్‌ అంగీకారం తెలిపినట్లు పేర్కొంది. అయితే ఇంకా హమాస్‌ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

పలువురు ప్రతినిధులు, గాజా పాలకులు (హమాస్‌ నేతలు లేకుండా) వారాంతంలో పారిస్‌లో సమావేశమయ్యారు. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం బందీల విడుదలకు సంబంధించి ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారని వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ తెలిపారు. పారిస్‌ సమావేశం అనంతరం ఇటీవల ఈజిప్ట్‌, ఖతారీ, అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌, హమాస్‌ ప్రతినిధులు కూడా సమావేశమయ్యారని ఈజిప్ట్‌ మీడియా వెల్లడించింది.  

ముస్లింల పవిత్రమాసమైన రంజాన్‌కు ముందు సంధి నెలకొనాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.  వివాదాస్పద అంశాలపై ” కొన్ని నూతన  సవరణలు” ప్రతిపాదించామని, అయితే కాల్పుల విరమణ, గాజాస్ట్రిప్‌పై సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇజ్రాయిల్‌ ఎటువంటి  స్పష్టమైన  వైఖరిని ప్రకటించలేదని హమాస్‌ వర్గాలు తెలిపాయి.

మరోవంక, ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఫారా శరణార్థి శిబిరంపై కూడా సైన్యం విరుచుకుపడినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మరోవంక, ఇజ్రాయిల్‌, లెబనాన్‌ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్‌ ప్రయోగించిన డ్రోన్‌ను లెబనాన్‌ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది. దక్షిణ లెబనాన్‌లోని ఇక్లిమ్‌ అల్‌ -తుఫా నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి గగనతలం క్షిపణితో కూల్చివేసినట్లు హిజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇజ్రాయిల్‌ దురాక్రమణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయిల్‌ అధికారులు తిరస్కరించారు. డ్రోన్‌ను కూల్చివేయడం అంటే అది ‘అద్భుత చర్య’ అవుతుందని తెలిపారు. 

ప్రతిచర్యగా ఇజ్రాయిల్‌ బీకా వ్యాలీ, మజదీల్‌ నగరంపై బాంబులతో దాడికి దిగింది. ఈ దాడిలో సుమారు నలుగురు మరణించారు. అగ్నిప్రమాదంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తినష్టం జరిగింది. టైర్‌ నగరంపై హిజ్బుల్లా బాంబుదాడితో హసన్‌ హుస్సేన్‌ సలామీని హత్య చేసినట్లు ఇజ్రాయిల్‌ ఆరోపణలతో లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులను వేగవంతం చేసింది.