కంచి జగద్గురువుల వాత్సల్యం

కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు, నడుస్తున్న దైవం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు శ్రీశైల కుంభాభిషేక నిమిత్తం శ్రీశైలంలో పీఠంతో గతవారం బసచేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఓ అద్వితీయ అనుభూతి కలిగింది.  ఆ రోజు సాయంత్రం ప్రదోషం అవ్వటం యాదృచ్ఛికమో లేక శివ సంకల్పమో కానీ భక్తులకి మాత్రం గొప్ప వరం.

ప్రదోష కాలంలో సాంబశివుడు నందివాహనారూఢుడై శ్రీశైలంలో విహరిస్తాడు అని నమ్మిక. ‘నా రుద్రో రుద్రమర్చయేత్’ అన్న వాక్యానికి సాక్ష్యంగా ప్రదోషం నాటి సాయంత్రం శ్రీ వారు ( పీఠాధీశ్వరులు ) నిత్య నూతన శోభతో శివ వర్చస్సుని మరింత ప్రస్ఫుటంగా కనబరుస్తూ పూజ చేస్తారు. కుంభాభిషేక కార్యక్రమాల వల్ల ఆ రోజు పొద్దున్న నుంచి శ్రీ వారికి భక్తులతో మాట్లాడటం వీలు పడలేదు. ఆనాడు ప్రదోష పూజ అయ్యేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది.

పూజ ఔతూనే పూజా వేదిక మీదకి ముందుకి వచ్చి కాచుకున్న భక్తులందరినీ పలకరించడం ఆరంభించారు. ఇంకా సావకాశంగా అనుగ్రహం చేయదలచుకున్నారో ఏమో కానీ రెండు నిముషాల్లో వచ్చి వారి సింహాసనం మీద ఆసీనులై ఒక్కొక్కరితో ముచ్చటించి వారి విన్నపాలు వింటున్నారు. కుంభాభిషేకంలో సహకరించిన ఒకరితో ధర్మం విషమయై దీర్ఘ చర్చ జరిపారు.

శ్రీ వారికి సమాజానికి హితం చెయ్యాలనే తీవ్ర  తపన వారి మాట్లాడే ప్రతీ మాటలో స్పష్టంగా తెలుస్తుంది.  ఆ మాట్లాడే వారిని తగురీతిన సత్కరించి, అటు పిమ్మట విజయవాడ కనక దుర్గ గుడి ధర్మాధికారితో చర్చ ప్రారంభించారు.  వారు శ్రీవారికి ప్రసాదంగా శేష వస్త్రం మరియు అమ్మవారి లడ్డూ సమర్పించారు. ఆ శేష వస్త్రం మెడలో అలంకరించుకుని, ఆ లడ్డూ డబ్బాని అలా చేతిలో పట్టుకుని ఆ ధర్మాధికారితో మరల ధర్మం విషయమై అంటే దేవస్థానం తరఫున ఏమి చెయ్యచ్చు ఇత్యాది సూచనలు చేస్తున్నారు.

మధ్య మధ్యలో ఇటు తిరిగి సామాన్య భక్తులకి తమ చూపులతో, చేతితో అనుగ్రహం చేసి పంపిస్తున్నారు. ఆ లడ్డూ అలా చేతిలోనే ఉంది. ఆ చర్చ అయ్యాక ఇటు తిరిగి ఒక పెద్దాయన చేతిలో ఆ లడ్డూ డబ్బా పెట్టబోయి – “ఇది కనక దుర్గ అమ్మవారి ప్రసాదం. తీసుకోండి ” అని మరలా ఆగి లడ్డూ పెట్టకుండా ” ఇంతకీ మీరు వచ్చిన విషయం?” అని అడిగారు.  ఆ పెద్దాయన మరి శ్రీవారిని చూసిన ఆనందమో లేక వయస్సు చేత వచ్చిన మరుపో తెలియదు కానీ ఎందుకు వచ్చామన్న విషయం మరిచిపోయారు.

శ్రీ వారు ఊరుకోలేదు. ” ఏమి శుభకార్యం? ఏమిటి? ” అని మరలా రెట్టించారు. పెద్దాయనది మళ్లీ అదే పరిస్థితి. నోట మాట లేదు. తన కుడి వైపు, ఎడమ వైపు, పైకి చూసుకుని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.  శ్రీ వారు అంతే ఓపికగా ఆయన వైపు చూస్తున్నారు చేతిలో అమ్మవారి లడ్డూ ఇంకా అలాగే ఉంచుకుని. ఆఖరికి శ్రీ వారు చిన్న పిల్లవాడు జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతుంటే మాట అందించి జవాబు చెప్పించినట్టు  “దంపతి ” అన్నారు.

వెంటనే పెద్దాయన  ” ఆ! దంపతి పూజ! దంపతి పూజ! ఆ ఆశీర్వాదం కోసమే వచ్చాను పెరియవ! ” అన్నారు. శ్రీ వారు సంతృప్తిగా పెద్ద నవ్వు నవ్వి  ” అది! దాని కోసం కదా వచ్చారు మీరు.  ఈ ప్రసాదం తీసుకోండి! ” అని ఆ లడ్డూను ఆయనకి అనుగ్రహించారు.  యోగ పురుషులు మనకున్న విన్నపాలు, కష్టాలు విని ఆశీర్వదించటం మనం చూసి ఉంటాము.

కానీ, ఇలా బిడ్డ మరచిపోతే గుర్తు చేసి ఓపిగ్గా అడిగి మరీ దీవించటం శ్రీ వారి వాత్సల్యానికి పరాకాష్ట. వారు అంతటి వాత్సల్య మూర్తి.  శ్రీ వారు ఏ గుడికి వెళ్ళినా అక్కడ హారతి ఇచ్చినప్పుడు మొదట వారు కళ్ళకద్దుకుని తర్వాత ఆ హారతిని పైకి ఎత్తి పట్టుకోమని చెప్తారు.  వారి వెనక ఉన్న అందరూ అద్దుకోవాలని తద్వారా అందరి కర్మ క్షయం అవ్వాలని.  అంతటి కారుణ్య మూర్తి వారు.