బైజూస్‌, పేటియంల మోసం స్టార్టప్‌లకు అప్రతిష్ట !

స్టార్టప్‌ల పేరుతో ప్రారంభమై దిగ్గజ సంస్థలుగా మారినటువంటి ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌, డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పిపిబిఎల్‌) సంస్థల్లో ఇటీవల వెలుగు చూసిన మోసాలు నివ్వెరపరుస్తున్నాయి. ఏడాది క్రితం రూ.1.80 లక్షల కోట్ల విలువ చేసిన బైజూస్‌  ఇప్పుడు రూ.20వేల కోట్ల దిగువకు పడిపోయింది. 

మరోవైపు శేఖర్‌ శర్మ వ్యవస్థాపకులుగా ఉన్న పిపిబిఎల్‌ తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడిందని ఇటీవల ఆర్‌బిఐ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో ఆ షేర్‌ భారీ పతనంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ మోసాలు దేశంలోని స్టార్టప్‌లకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. ఈ రంగంలో కొత్త పెట్టుబడులపై ఆశలు సన్నగిల్లేలా చేశాయి.

బైజూస్‌ వ్యవస్థాపకులు అనర్హులు అంటూ అందులో పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.కంపెనీ బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్‌ అడిట్‌ చేపట్టాలని కోరారు. 

ఈ డిమాండ్లతో బెంగళూరులోని నేషనల్‌ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి)లో నలుగురు ఇన్వెస్టర్ల గ్రూపు పిటిషన్‌ దాఖలు చేసింది. దావా వేసిన ఇన్వెస్టర్లలో ప్రోసస్‌, జనరల్‌ అట్లాంటిక్‌, సోఫినా, పీక్‌ ఎక్స్‌వి ఉన్నాయి. వీరికి టైగర్‌, ఓల్‌ వెంచర్స్‌ వంటి వాటాదారుల మద్దతూ ఉంది. 

శుక్రవారం జరిగిన కంపెనీ అసాధారణ వార్షిక బోర్డు సమావేశానికి బైజూస్‌ వ్యవస్థాపకులు, సిఇఒ బైజూ రవీంద్రన్‌ సహా ఆయన కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం గమనార్హం. కంపెనీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు కోర్టును ఆశ్రయించారు.

 బైజూస్‌ యాజమాన్యం వేధింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అసాధారణ వార్షిక బోర్డు జరుగుతున్న రోజే ఎన్‌సిఎల్‌టిని ఇన్వెస్టర్ల గ్రూప్‌ ఆశ్రయించడంతో వారు బైజూస్‌ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కంపెనీని నడిపించేందుకు సిఇఒ రవీంద్రన్‌ సహా ఇతర వ్యవస్థాపకులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్‌సిఎల్‌టిని కోరారు. 

ఇటీవలే ముగిసిన రైట్స్‌ ఇష్యూను సైతం రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి కార్పొరేట్‌ చర్యలను కంపెనీ యాజమాన్యం తీసుకోకుండా నిలువరించాలని సూచించారు. వ్యవస్థాపకుల ఆర్థిక అవకతవకల వల్ల కంపెనీ అనుబంధ విభాగమైన ఆకాశ్‌పై నియంత్రణ కోల్పోతున్నామని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తంచేశారు. 

మరోవైపు బైజూస్‌ ఆల్ఫా దివాలా దశకు చేరుకుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కార్పొరేట్‌ పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. సింగపూర్‌కు చెందిన నార్త్‌వెస్ట్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ కొనుగోలు విషయంలో అనధికారిక కార్పొరేట్‌ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఇక పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ సేవలు మార్చి 15 తర్వాత దాదాపుగా పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ సంస్థలో భారీ మొత్తాల్లో మనీలాండరింగ్‌ జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో ఇటీవల ఆ సంస్థపై ఆర్‌బిఐ వేటు వేసిన విషయం తెలిసిందే. పిపిబిఎల్‌ ద్వారా వందల కోట్ల రూపాయల సందేహాస్పద లావాదేవీలు జరిగాయి.

 లక్షల సంఖ్యలో తప్పుడు కెవైసి ఖాతాలు, కొన్ని వేల సందర్బాల్లోనూ ఒకే పాన్‌ కార్డును బహుళ ఖాతాలను తెరవడానికి ఉపయోగించింది. పేటియం పేమెంట్‌ బ్యాంక్‌లో 2021లోనే తీవ్రమైన కెవైసి, యాంటీ మనీ లాండరింగ్‌ ఉల్లంఘనలను గుర్తించి.. ఆర్‌బిఐ హెచ్చరించినప్పటికీ ఆ సంస్థ యాజమాన్యం పెడ చెవిన పెట్టింది. పేటియం ఆర్థిక మోసాలపై పరిణామాలపై ఇడి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

బైజూస్‌, పేటియంల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌లు చాలా కాలం క్రితమే జరిగి ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు. రెగ్యులేటరీ సంస్థల నిర్లక్ష్యం ఫలితంగా భారీ తొలగింపులు, ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సవాళ్లతో సహా పారదర్శకత కలిగిన స్టార్టప్‌లు గడ్డుకాలాన్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైజూ రవీంద్రన్‌, శేఖర్‌ శర్మ లాంటి ఒక వ్యక్తిని కీర్తించి పెట్టుబడులు కుమ్మరించే వారికి ఇవో పెద్ద గుణ పాఠాలుగా చెప్పొచ్చని అభిప్రాయపడుతున్నారు.