గంగాధర శాస్త్రికి ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు

* రాజారెడ్డి, రాధా రెడ్డి దంపతులకు అకాడమీ రత్న

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఎల్ వి గంగాధర శాస్త్రికి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను, ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. 

తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో, భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథంగా పాడడంతో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత’ గా శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి, డా. ఏ పి జె అబ్దుల్ కలాం చేతులమీదుగా విడుదల చేశారు.

అంతటి తో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, స్వార్ధరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసినందుకు గంగాధర శాస్త్రి కి ఈ అవార్డు దక్కింది.  ఈ మహత్కార్యం చేసినందుకు గతంలో గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ (హంస) పురస్కారంతోను, మధ్యప్రదేశ్ లోని ‘మహర్షి పాణిని యూనివర్సిటీ’ ‘గౌరవ డాక్టరేట్’ తోను సత్కరించింది. 

కాగా ఇప్పుడీ అవార్డు ప్రకటించిన నేపధ్యంలో, ‘గీత’ పట్ల తన అంకిత భావాన్ని గత 16 సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి జి. కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్య పురేచకు, జ్యూరీ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఇది తనకు తొలి జాతీయ అవార్డు చెబుతూ ఈ అవార్డు, పాట నేర్పిన తన తల్లి తండ్రులకు, ‘గీతా గాన మార్గదర్శి’ ఘంటసాలకు, గీతా సద్గురువులకు, శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమని చెప్పారు. ‘భగవద్గీత’ అంటే భారతదేశపు ఆలోచనా విధానమని, ఇది మతాలకు అతీతమైన, సర్వజనామోదయోగ్యమైన, ఆచరణీయమైన, అత్యుత్తమమైన కర్తవ్య బోధ అని ఆయన స్పష్టం చేశారు. 

దీనిని ప్రతి ఒక్కరూ చదివి, అర్ధం చేసుకుని, ఆచరించడం ద్వారా స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని ఏర్పరచవచ్చని, అందుకే తమ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ద్వారా గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని గంగాధర శాస్త్రి వివరించారు.  భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడం ద్వారా ఈ దేశపు జ్ఞాన సంపదను గౌరవించాలని భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. 

గీతను పాఠ్యాంశంగా చేర్చి బాల్య దశ నుంచే పిల్లలకు నేర్పించడం ద్వారా, మానవీయ విలువలను పెంపొందించవచ్చని ఆయన చెప్పారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా భారతీయుల ఆత్మ గౌరవాన్ని కాపాడినందుకు, పాఠ్య పుస్తకాల్లో మన దేశం పేరుని భారత్ గా మార్పుచేసి చరిత్ర ను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి నమస్సులతో కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

కాగా, సంగీత నాటక అకాడమీ బుధవారం ఆరుగురు అకాడమీ ఫెలో (రత్న)లు, 92 మంది కళాకారుల జాబితాను ప్రకటించింది. 2022, 2023 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకునే కళాకారులలో గాయని బాంబే జయశ్రీ, నటులు అశోక్ సరాఫ్, రాజీవ్ వర్మ ఉన్నారు. జాతీయ సంగీత, నృత్య, నాటక అకాడమీ ప్రదర్శక కళల రంగంలో ప్రసిద్ధ వ్యక్తులను అకాడమీ ఫెలో (రత్న)లుగా ఎంపిక చేసింది. 

వారిలో కూచిపూడి నృత్య దంపతులు రాజా రెడ్డి, రాధా రెడ్డి, జానపద కళాకారుడు, రచయిత వినాయక్ ఖెడెకర్, వీణ విద్వాంసుడు ఆర్ విశ్వేశ్వరన్, కథక్ డ్యాన్సర్ సునయన హజారిలాల్, రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్, నాటక రచయిత డిపి సిన్హా ఉన్నారు. 

అకాడమీ ఫెలో అవార్డు రూపంలో రూ. 3 లక్షల నగదు బహుమతి ఇస్తారు. అకాడమీ అవార్డుగా లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు, తామ్రపత్రం, అంగవస్త్రం బహూకరిస్తారు. 2022, 2023 సంవత్సరాలకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను 80 మంది యువ కళాకారులకు కూడా అకాడమీ ప్రకటించింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ రూపంలో రూ. 25 వేల నగదు బహుమతితో పాటు, ఒక తామ్రపత్రం, అంగవస్త్రం బహూకరిస్తారు.