ఆరు గ్యారెంటీలతో గారడీలు చేసి ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో గారడీలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. రైతుబంధు పది వేల రూపాయలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్ 15వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. 
 
అధికారంలోకి వచ్చాక అమలు చేయలేక షరతుల పేరుతో మోసం చేస్తున్నారన్నారని అంటూ రాష్ట్రంలో 90లక్షల పైగా పేదవారికి రేషన్ కార్డులు ఉంటే సిలిండర్స్ మాత్రం 40 లక్షల మందికేనని షరతులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అందరికి ఉచిత గ్యాస్ సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్ అని గొప్పలు చెప్పి.. ఇప్పుడు లబ్ధిదారుల జాబితాను తగ్గించడమేంటని ప్రశ్నించారు.
 
మొన్నటివరకు బీఆర్ఎస్ కు కొమ్ము కాసిన మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తోందని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని చెబుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగిన విజయసంకల్ప యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా అపూర్వస్వాగతం పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 
 
ప్రజలంతా నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేస్తామని అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు సంక్షేమ పథకాలు అందరికి.. అధికారంలోకి రాగానే కొందరికి కొన్ని మాత్రమే అనేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

గత సీఎం కేసీఆర్ గారి కుటుంబ, నియంతృత్వ పోకడలు, ప్రజా వ్యతిరేక చర్యల వల్ల ప్రజలు మార్పు కోరుకున్నారని, ఆ మార్పులో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగిందని తెలిపారు.  ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా తీర్పును శిరసావహించకుండా, అసహనంతో ఓడిపోయామనే అక్కసుతో వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

ముఖ్యమంత్రి కాలేదనే భావనతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భారతీయ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహితం బీజేపీ నాయకుల పట్ల స్థాయి మరచి  మాట్లాటడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.  సుధీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మంత్రులు కావడంతో భారతీయ జనతా పార్టీ పైన అనేక మాటలు మాట్లాడుతున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారనే అక్కసుతో కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయాడానికి సిద్ధంగా లేరని చెబుతూ అనేక మంది ఆ పార్టీ ఎంపీలు బిజెపితో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని వెల్లడించారు.