జులై 1 నుంచి మూడు కొత్త నేర చట్టాల అమలు

బ్రిటిష్‌ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నేర చట్టాలు ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
ఇప్పటివరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) , నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి ), భారత సాక్ష్యాధార చట్టం-1872ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బిఎస్‌ఎస్‌) , భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య (బిఎస్‌) చట్టాలను వర్తింపజేయనున్నారు. గతేడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
 
హోమ్ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ పలు సిఫార్సులు చేసిన తర్వాత 2023 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుకు పలు మార్పులు చేసి మరోసారి సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ బిల్లులను రూపొందించామని, ముసాయిదాను తాను పూర్తిగా పరిశీలించానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
 
ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబరు 25న రాష్ట్రపతి సంతకంతో అవి చట్ట రూపం దాల్చాయి. నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా పార్లమెంట్‌లో తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతో పాటు రాజద్రోహం వంటి పదాలను తొలగించామని, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చామని వివరించారు.
 
భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్‌ ఉండగా, కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్‌గా పెట్టారు. కిడ్నాప్‌నకు పాత చట్టంలో 359వ సెక్షన్‌ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 136 కింద చేర్చారు.

భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలను చేర్చగా ఐపిసిలో ఉన్న 19 నిబంధనలను కొత్త చట్టంలో తొలగించారు. 33 నేరాలలో జైలు శిక్షను పెంచడం జరిగింది. 83 నిబంధనలలో జరిమానా శిక్షను పెంచగా 33 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టడం జరిగింది. ఆరు నేరాలలో శిక్షగా సమాజ సేవను ప్రవేశపెట్టారు. 

కొత్త క్రిమినల్ చట్టాలలో ప్రతిపాదించిన ప్రధాన మార్పులలో చిన్నారి(చైల్డ్)కి నిర్వచనం ఇవ్వడం, జెండర్‌కి ఇచ్చిన నిర్వచనంలో ట్రాన్స్‌జెండర్‌ను చేర్చడం, డాక్యుమెంట్‌కు సంబంధించిన నిర్వచనంలో ఎలెక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను చేర్చడం, చరాస్తికి చ్చిన నిర్వచనంలో అన్ని రకాల ఆస్తులను చేర్చడం వంటివి ఉన్నాయి.

1860 భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, 2023 ని తీసుకువచ్చారు. ఇందులో రాజద్రోహం అంశాన్ని తొలగించారు. కానీ భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా చేసే వేర్పాటువాదం, వేర్పాటువాద తిరుగుబాటు, ఉగ్రవాదం వంటి చర్యలను కఠినంగా శిక్షించే మరో నిబంధనను ప్రవేశపెట్టారు. మైనర్లపై సామూహిక అత్యాచారం, మూకదాడులకు మరణశిక్ష నిబంధనను పొందుపర్చారు. మొదటిసారిగా కమ్యూనిటీ సర్వీసెస్ ఒక శిక్షగా ప్రవేశపెట్టారు.
 
1973 సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023 ని తీసుకువస్తున్నారు. ఇందులో నేరాలకు సంబంధించి దర్యాప్తు, విచారణలతో పాటు తీర్పు వెలువరించడానికి స్పష్టమైన కాలపరిమితి విధించారు. లైంగిక దాడి బాధితుల వాంగ్మూలాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేయడానికి కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు.
 
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో భారతీయ సాక్ష్యాయ చట్టం, 2023 ను ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డులు, ఇ మెయిల్స్, సర్వర్ లాగ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, ఎస్ఎంఎస్ లు, వెబ్ సైట్లు, లొకేషన్ ఎవిడెన్స్, మెయిల్స్, ఎలక్ట్రానిక్ డివైజ్ల లోని సందేశాలను సాక్ష్యాలుగా పరిగణించాలని నిర్ణయించారు. కేస్ డైరీ, ఎఫ్ఐఆర్, ఛార్జీషీట్, తీర్పు కాపీలను తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. అలాగే, ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులు.. పేపర్ రికార్డుల మాదిరిగానే చట్టపరంగా చెల్లుబాటు అవుతాయి.