తెలంగాణ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యాక్షుడిగా చిన్నారెడ్డి

మాజీ మంత్రి డా. జి. చిన్నారెడ్డిని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా నియాక‌మైన చిన్నారెడ్డికి కేబినెట్ హోదా ఉండనుంది. మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మొదట చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రక‌టించింది. 

అయితే మళ్లీ చిన్నారెడ్డి పేరును తొల‌గిస్తూ మేఘా రెడ్డికి అవ‌కాశం కల్పించగా, ఆమె బీఆర్ఎస్ నేత నిరంజ‌న్ రెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందింది.  అపారమైన రాజకీయ అనుభవం ఉనన చిన్నా రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పని చేశారు. పార్టీ తెలంగాణ ఎంఎల్‌ఎల ఫోరం చైర్మన్‌గా తన వాణి వినిపించారు.

చిన్నారెడ్డి వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గతంలో మొత్తం ఎనిమిది సార్లు పోటీ చేసి నాలుగు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చిన్నారెడ్డి ప‌ని చేశారు.  2021లో జ‌రిగిన హైద‌రాబాద్- రంగారెడ్డి- మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌వి చూశారు. 

అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.  ఎంఎస్‌సి (అగ్రికల్చర్), ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పట్టా పొందిన చిన్నారెడ్డి పిహెచ్‌డి డాక్టరేట్ ను మలేషియా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలపూర్ చిన్నారెడ్డి స్వగ్రామం. హై స్కూల్ విద్యాభ్యాసం వనపర్తిలో సాగింది.