సీబీఐ కేసులో నిందితురాలిగా కవిత.. అరెస్ట్ తప్పదా!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది.  ఈ కేసులో పాత్ర ఉందన్న ఆరోపణలతో కవిత ఇప్పటివరకు కేవలం సమాచారం కోసం ఈడీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే ప్పుడు ఎమ్మెల్సీ కవితను కూడా నిందితురాలిగా పరిగణిస్తున్న సీబీఐ కేసులో ఆమె పేరును చేర్చింది. 

ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా జారీ చేసింది. 41 (ఏ) కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టంగా అధికారులు పేర్కొన్నారు. దానితో ఆమె అరెస్ట్ తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  వాస్తవానికి 26న విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది. 

అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంది. ఈ పరిణామం బిఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. సుమారుడు ఏడాదిన్నరగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా.. చాలా మందిని సీబీఐ, ఈడీ విచారిస్తూ వస్తున్నాయి. 

కాగా ఇప్పటికే కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా కవితకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారంతో కవితకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో కవిత పీఏ అశోక్ కౌశిక్ ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను న్యాయమూర్తి ముందు బయట పెట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు స్టేట్ మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. దీంతో కవితతో పాటు అశోక్ కౌశిక్‌ని కూడా సీబీఐ నిందితులుగా పరిగణిస్తోంది.

విచారణకు హాజరైతే.. సాక్ష్యాలతో సహా విచారణ జరిపి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పాటు విచారణకు హాజరుకాకపోయినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయని భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి అరెస్టులు జరగ్గా, మరి కవిత విషయంలో ఏం జరగనుందన్నది ఉత్కంఠగా మారింది. గత డిసెంబర్ లో కవితను సీబీఐ విచారించింది. ఇప్పటి వరకు ఈడీ మూడు సార్లు విచారణ జరిపింది.

ప్రశ్నించిన సమయంలో రాత్రి 10 నుంచి పదకొండింటి వరకు, సుమారు 6 నుంచి 8 గంటల సమయం విచారించారు. ఈ క్రమంలోనే తన దగ్గరున్న ఫొన్లను కూడా అధికారులకు అందజేశారు. అయితే ఈడీ తనను రాత్రుళ్లు కూడా విచారించటంపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దానితో విచారణ పూర్తియ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మధ్యలో ఈడీ నోటీసులు ఇచ్చిన తాను వేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చే వరకు తాను విచారణకు హాజరుకానని కవిత చెప్పేశారు. అయితే సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా? లేదా కోర్టును ఆశ్రయిస్తారా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత  ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది.