వన ప్రవేశంతో ముగిసిన మేడారం జాతర

నాలుగు రోజులపాటు విశేష పూజలు అందుకున్న సమ్మక్క, సారలమ్మ లు శనివారం వన ప్రవేశంతో మేడారం జాతర ఘట్టం ముగిసింది. మహా జాతరలో భాగంగా బుధవారం గద్దెలపైకి సారలమ్మ రాకతో ప్రారంభమైన జాతర ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొ క్కులు చెల్లించారు. 

ఈ నాలుగు రోజులు భక్తులు పోటెత్తడంతో మేడారం జన జాతరను తలపించింది. ఒకవైపు భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు, మరోవైపు నిలువెత్తు బంగారం సమర్పణలు ఇలా ఎటుచూసినా మేడారం కోలాహలంగా మారింది.  మేడారం జాతర చివరి ఘట్టమైన అమ్మవార్ల వన ప్రవేశం శనివారం పూజారులు ఎంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 

ఇందులో భాగంగా ముందుగానే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు ఆయా పూజారులు (వడ్డెలు)లు చేరుకుని ఎంతో భక్తిశ్రద్ధలు, సంప్రదాయపద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పూజా కార్యక్రమాలు బయటకు కనిపించకుండా అరగంట పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఆ తరువాత సంప్రదాయ పద్ధతిలో మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, భారీ బందోబస్తు నడుమ పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారివారి ఆలయాలకు తీసుకెళ్లగా, కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు, కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కలను సూర్యాస్తమయం తర్వాత రాత్రి 7.27 నిమిషాలకు వన ప్రవేశం చేయించడంతో జాతర ఘట్టం ముగిసింది. 

తల్లులు వన ప్రవేశం చేసే సమయంలో వరుణదేవుడు చిరుజల్లులు కురిపించడంతో భక్తులు పరవశించిపోయారు. అయితే వన దేవతల వన ప్రవేశం ముగియటంతో భక్తులు సొంత వాహనాలు, ఆర్‌టిసి బస్సులు ద్వారా తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రపంచంలోనే మేడా రం అతిపెద్ద జాతర అని, నాలుగు రోజుల్లో 1.45 కోట్ల మంది వనదేవతలను దర్శించుకున్నారని మంత్రి సీతక్క చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అత్యధికంగా నిధులు కేటాయించారని, సుమారు 20 శాఖల అధికారులను సమన్వయం చేసి జాతరను విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా మేడారం జాతరకు 10వేల ట్రిప్పుల బస్సులు నడిచాయని తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో అన్ని వ్యాపారాలు కలిపి సమారు రూ.1000కోట్లకు పైగా లావాదేవీ లు జరిగిఉంటాయని అంచనా వేస్తున్నారు.